కాంగ్రెస్లో మళ్లీ మొలకలొచ్చాయి..75 సీట్లు వస్తాయని ధీమా

 కాంగ్రెస్లో  మళ్లీ మొలకలొచ్చాయి..75 సీట్లు వస్తాయని ధీమా

తెలంగాణ కాంగ్రెస్లో సందడి నెలకొంది. పార్టీలో చేరికలతో  టీపీసీసీలో జోష్ పెరిగింది. మొన్నటి వరకు బహిరంగంగానే విమర్శించుకున్న సీనియర్లు ఇప్పుడు కలిసిపోయారు. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుంటూ మేమంతా ఒక్కటయ్యాం అన్న సందేశాన్ని ఇస్తున్నారు. తాజాగా ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో తెలంగాణ  కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరికల అంశంపై రాహుల్ గాంధీతో మీటింగ్ అనంతరం ఫోటో సెషన్ నిర్వహించారు. ఈ ఫోటో సెషన్ లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కితో పాటు..ఇతరు నేతలంతా అప్యాయంగా మాట్లాడుకున్నారు. 


35 మంది నేతల జాబితా...

కాంగ్రెస్లో తెలంగాణ నుంచి చేరబోయే వారి లిస్టును ఆ పార్టీ విడుదల చేసింది.  మొత్తం 35 మంది కాంగ్రెస్లో చేరుతున్నట్లు పేర్కొంది. ఈ జాబితాలో మహబూబ్ నగర్ నేతల పేర్లు ఫస్ట్ ఉన్నాయి. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలోని నేతల పేర్లు ఉన్నాయి.  35 మంది పేర్లు ఆధార్ నెంబర్లతో జాబితాను విడుదల చేశారు. 

75 సీట్లు పక్కా..షార్ట్ అండ్ స్వీట్ గా మేనిఫెస్టో..

తెలంగాణను సీఎం కేసీఆర్ నాశనం చేశారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా 75 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారంతా తిరిగి రావాలని కోరారు. జూన్ 27వ తేదీన స్ట్రాటజీ మీటింగ్ ఉంటుందని..అందులో అన్ని విషయాలు చర్చిస్తామన్నారు. దీంతో పాటు మేనిఫెస్టోపై కూడా చర్చించి వెల్లడిస్తామన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. ఈ విషయాన్ని శరద్ పవార్ కూడా చెప్పారని గుర్తు చేశారు.