- బిల్లులో నకిలీ విత్తనాల కట్టడిపై స్పష్టత లేదు: కేటీఆర్
- కార్పొరేట్ కంపెనీలకు లాభం చేసేలా ఉందని విమర్శ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విత్తన బిల్లు వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ బిల్లును పక్కనపెట్టాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు సంఘాలు, నిపుణలు, రాజకీయపార్టీలతో చర్చించిన అనంతరం ముందుకు వెళ్లాలని సూచించారు. ముసాయిదా విత్తన బిల్లుపై గురువారం ఆయన తన ఫీడ్‌బ్యాక్‌ను అందించారు. నకిలీ విత్తనాలను కట్టడి చేసే అంశంపై బిల్లులో స్పష్టత లేదన్నారు.
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు నిర్దిష్ట సమయంలోనే నష్టపరిహారం అందించే అంశంపైనా గ్యారంటీ లేదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విత్తన ధరలను నిర్ణయించే నిబంధనలు బిల్లులో ఉన్నాయన్నారు. గతంలా విత్తనాల ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

