- వీళ్ల పాలన పాడుగాను నియోజకవర్గానికి నిధులిస్తలేరు
- మహాలక్ష్మి స్కీం సంబురాల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ‘నేనే మంత్రినైతే ఏడాదిలోపు రాష్ట్రంలోని బస్టాండ్ల రూపు రేఖలు మారుస్తా.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కావాలని మంత్రులకు అడిగినా ఫలితం లేకుండాపోతోంది వీళ్ల పాలన పాడుగాను’ అంటూ కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం బస్టాండ్లో ఆర్టీసీ ఆధ్వర్యంలో గురువారం మహాలక్ష్మి స్కీం సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాలక్ష్మీ స్కీం ను ద్వారా రెగ్యులర్గా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన పలువురు మహిళలను సన్మానించి మాట్లాడారు. రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీం అద్భుతమైందని కితాబిచ్చారు. ఈ స్కీంతో మహిళలు దాదాపు రూ. 10వేల కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలోని పలు బస్టాండ్లు అధ్వాన్నంగా ఉన్నాయని విమర్శించి, వాటి అభివృద్ధి కోసం రూ. 700 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బస్టాండ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, టాయ్లెట్స్ సక్కగా లేవన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్టాండ్ శిథిలావస్థకు చేరిందన్నారు. రోడ్లు కంకర తేలి ఉన్నాయని తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచలలో అధునాతన కొత్త బస్టాండ్ల నిర్మాణాల కోసం అవసరమైతే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. బస్టాండ్ల నిర్మాణాల కోసం మంత్రులకు విన్నవించానన్నారు. కానీ ఫలితంలేకుండా పోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, యూనియన్ల నేతలు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, ఆర్టీసీ యూనియన్ నేత భాస్కర్ పాల్గొన్నారు.
చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని సీఎం కు లేఖ
చేర్యాల : చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని సీఎంరేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెళ్ళి, ధూల్మిట్ట మండలాలతో కలిసి చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా మార్చాలని గత 10 సంవత్సరాల నుంచి జేఏసీ ఉద్యమాలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన అశాస్త్రీయ విభజనల వల్ల ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు.
