హెరిటేజ్​ రైళ్లలో టూర్

హెరిటేజ్​ రైళ్లలో టూర్

టూరిస్ట్​లు లాంగ్​ జర్నీని ఇష్టపడతారు. అది కూడా పర్వత ప్రాంతాల అందాలు, హెరిటేజ్​ సైట్లను చూసొస్తే ఎంతో థ్రిల్ ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉండే హెరిటేజ్​ ట్రైన్స్​లో జర్నీ మాంచి ఫీల్​నిస్తుంది. టూరిస్ట్​ ప్లేసెస్​కి చేర్చడమే కాకుండా ఆయా ప్రాంతాల చరిత్రను కళ్లకి కడతాయి ఈ రైళ్లు. అందుకే ట్రావెలర్స్ వీటిలో ప్రయాణించడాన్ని ​ ఇష్టపడతారు. ఈ​ మౌంటెన్​ ట్రైన్స్​లో జర్నీ ఎందుకంత స్పెషలో తెలియాలంటే ఇది చదవాల్సిందే. 

డార్జిలింగ్​, హిమాలయన్​
టూరిస్టుల్ని ఆకర్షిస్తోన్న ఫేమస్​ టూరిస్ట్ ప్లేసుల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని ఎంతో అందమైన పర్వత ప్రాంత రైల్వేగానూ దీనికి పేరుంది. కొండ ప్రాంతాల మీదుగా వెళ్లే ఈ రైలుని ‘టాయ్​ ట్రైన్’ అని పిలుస్తారు. ఈ రైలు న్యూ జల్​పైగురి స్టేషన్​ నుంచి డార్జిలింగ్​ వరకు వెళుతుంది. ఆరు జిగ్​జాగ్ రూట్స్​, నాలుగు లూప్స్​ దాటి ఎత్తైన ప్రాంతానికి టూరిస్టుల్ని తీసుకెళుతుంది. 1999లో ఈ ప్రాంతాన్ని హెరిటేజ్ సైట్​గా డిక్లేర్​ చేశారు.  

కల్కా–షిమ్లా
హర్యానాలోని కల్కా నుంచి షిమ్లా వరకు ఈ ట్రైన్​లో వెళ్లొచ్చు. ఇది నేరోగేజ్​ రైల్వే లైన్​. రెండు ఫీట్ల ఆరు ఇంచులు మాత్రమే ఉన్న రైల్వేట్రాక్​ మీద పెద్ద శబ్దం చేస్తూ వెళ్తాయి ట్రైన్స్​. అందమైన అడవి, హిమాలయ పర్వతాల అంచు వెంబడి సాగే ఈ రైలు ప్రయాణం టూరిస్ట్​లకి థ్రిల్లింగ్​గా ఉంటుంది.  
మాథెరన్​ హిల్​
మహారాష్ట్ర రాయ్​గఢ్​ జిల్లాలోని చిన్న హిల్​స్టేషన్​  మాథెరన్​. రెయినీ సీజన్​లో ఇక్కడి జలపాతాలు కనువిందు చేస్తాయి. ఇది కూడా నేరోగేజ్​ రైల్వే. 21 కిలోమీటర్ల ఈ రైలు ప్రయాణంలో  పశ్చిమ కనుమలను చూస్తూ ఎంజాయ్​ చేయొచ్చు. వీటితో పాటు డోధాని జలపాతం, ఛందేరి గుహలు, అంబర్​నాథ్​ శివుడి గుడి వంటివి చూడొచ్చు.  
నీలగిరి మౌంటెన్
ఊటీ వెళ్లాలనుకునే వాళ్లు మెట్టుపాలయంలో ట్రైన్​ ఎక్కి, నాలుగున్నర గంటలు జర్నీ చేయాలి. స్టీమ్​తో నడిచే ఈ రైల్లో నీలగిరి కొండల్ని చూస్తూ ఎంజాయ్​ చేయొచ్చు. సమ్మర్​ సీజన్​లో ఇక్కడ రద్దీ​ ఎక్కువ. ఆ టైంలో రోజుకు నాలుగు రైళ్లు వెళతాయి. ఈ రైల్వేని బ్రిటీషు కాలంలో నిర్మించారు.  మనదేశంలో ఉన్న ఒకే ఒక రాక్​ రైల్వే ఇది.