లక్నో గెలుపు.. రోహిత్‌‌‌‌సేనకు వరుసగా ఎనిమిదో ఓటమి

లక్నో గెలుపు.. రోహిత్‌‌‌‌సేనకు వరుసగా ఎనిమిదో ఓటమి

ముంబై: ఐపీఎల్‌‌‌‌15లో ముంబై ఇండియన్స్‌‌‌‌ ఆట మారలేదు. 1083  రోజుల తర్వాత సొంత స్టేడియం వాంఖడేలో ఆడిన తొలి పోరులోనూ ముంబై రాత మారలేదు.  కనీసం తమ మెంటార్‌‌‌‌ సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌ పుట్టిన రోజైనా గెలిచి అతనికి బర్త్‌‌‌‌డే గిఫ్ట్‌‌‌‌ ఇస్తుందనుకుంటే అదీ జరగలేదు. బౌలింగ్‌‌‌‌లో కాస్త మురిపించినా.. బ్యాటుతో మళ్లీ ఫెయిలైన ముంబై వరుసగా ఎనిమిదో ఓటమితో ప్లేఆఫ్స్‌‌‌‌ రేసు నుంచి వైదొలిగింది. మరోవైపు ముంబై అంటేనే దంచికొట్టే లోకేశ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (62 బాల్స్‌‌‌‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 నాటౌట్‌‌‌‌) సీజన్‌‌‌‌లో రెండో సెంచరీ బాదాడు. దాంతో,   ఆదివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో లక్నో సూపర్‌‌‌‌ జెయింట్స్‌‌‌‌ 36 రన్స్ తేడాతో ముంబైని చిత్తు చేసి ఐదో విక్టరీ ఖాతాలో వేసుకుంది.  తొలుత రాహుల్‌‌‌‌ సూపర్ సెంచరీతో చెలరేగడంతో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 168/6 స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో పొలార్డ్ (2/8), రిలే మెరిడిత్ (2/40) రెండు వికెట్లతో రాణించారు. ఛేజింగ్ లో విఫలమైన ముంబై ఓవర్లన్నీ ఆడి 132/8 స్కోరు మాత్రమే  చేసి ఓడింది. రోహిత్‌‌‌‌ శర్మ (31 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 39), తిలక్‌‌‌‌ వర్మ (27 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) తప్ప మిగతా ప్లేయర్లంతా బ్యాట్లెత్తేశారు. లక్నో బౌలర్లలో క్రునాల్ పాండ్యా (3/19) మూడు వికెట్లతో రాణించాడు. రాహుల్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.

కేఎల్​ హవా..

కెప్టెన్ రాహుల్ మెరవడంతో ముంబై ముందు లక్నో మంచి టార్గెట్ ను ఉంచింది. మిగతా బ్యాటర్లు విఫలమైనా అచ్చొచ్చిన మైదానంలో సెంచరీ బాదిన  కేఎల్ ఒక్కడే జట్టును ఆదుకున్నాడు. ఫస్ట్ ఓవర్లోనే ఫోర్ తో బౌండ్రీల వేట మొదలెట్టిన రాహుల్ తర్వాత రెండు ఫోర్లతో జోరు పెంచాడు. కానీ, బుమ్రా (1/31) బౌలింగ్ లో డికాక్ (10) ఔటయ్యాడు. అనంతరం రాహుల్, మనీశ్ పాండే (22)లను ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో నాలుగు ఓవర్ల పాటు ఒక్క బౌండరీ రాలేదు. కానీ 10వ ఓవర్లో పాండే ఓ సిక్స్, రాహుల్ రెండు ఫోర్లు బాదడంతో సగం ఓవర్లకు లక్నో 72/1తో నిలిచింది.అదే జోరుతో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక కాసేపటికే పాండే, క్రునాల్ (1),  స్టోయినిస్ (0) వెనుదిరిగినా.. రాహుల్ జోరు మాత్రం తగ్గలేదు. బుమ్రా వేసిన 17వ ఓవర్లో 4,4తో పాటు ఉనాద్కత్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో రాహుల్ స్కోర్ ను 150 దాటించాడు. ఇక ఇన్నింగ్స్ చివరి ఓవర్లో సిక్స్‌‌‌‌తో  61 బాల్స్‌‌‌‌లోనే సెంచరీ దాటాడు. ఆపై బదోని (14) మరో సిక్స్ బాది లక్నోకు మంచి స్కోరు అందించాడు.

ముంబై ఫెయిల్‌‌‌‌

నార్మల్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో మంచి ఆరంభం వచ్చినా మధ్యలో తడబడ్డ ముంబై పాత కథనే రిపీట్​ చేసింది. తొలుత ఓపెనర్లు రోహిత్, ఇషాన్ (20 బాల్స్‌‌‌‌లో 8) జాగ్రత్తగా ఆడేందుకే మొగ్గుచూపడంతో ముంబై స్కోర్ బోర్డు నెమ్మదిగా కదిలింది. ఫామ్ కోసం తపిస్తున్న హిట్ మ్యాన్ రెండో ఓవర్లోనే ఫోర్ తో టచ్ లో కనిపించగా ఇషాన్ మాత్రం టెస్టు బ్యాటింగ్ తలపించాడు. ఈ దశలో హోల్డర్ వేసిన ఆరో ఓవర్లో 4,6తో  తాబేలు నడకలా సాగుతున్న ఇన్నింగ్స్ కు రోహిత్ ఊపు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారిగా లక్నో బౌలర్లు రెచ్చిపోవడంతో మ్యాచ్ గమనమే మారిపోయింది. వరుస ఓవర్లలో ఇషాన్, డేవాల్డ్ బ్రేవిస్ (3) ఔట్ కాగా.. కుదురుకుంటున్న రోహిత్ ను క్రునాల్ పెవిలియన్ చేర్చడంతో ముంబై 58/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో బదోనికి బౌలింగ్ ఇచ్చిన రాహుల్ ఫలితం రాబట్టాడు. అతడి ఓవర్లో సూర్యకుమార్ (7) ఔటవడంతో లక్నో విక్టరీ ఖాయంగా కనిపించింది. ఈ సమయంలో తిలక్ వర్మ, పొలార్డ్ (19) ఇన్నింగ్స్ ను ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. 14వ ఓవర్లో రెండు సిక్సర్లతో పాటు 16వ ఓవర్లో 4,4 కొట్టిన తిలక్ ఆశలు రేపాడు. కానీ 8వ ఓవర్లో తిలక్​ను ఔట్ చేసిన హోల్డర్​ లక్నో గెలుపు ఖాయం చేశాడు.  చివరి  12 బాల్స్ లో ముంబైకి 44 రన్స్ అవసరం అవగా.. 9 రన్సే ఇచ్చి పొలార్డ్, ఉనాద్కత్ (1), సామ్స్ (3) వికెట్లు తీసిన లక్నో ఈజీగా గెలిచింది.  
4  ఐపీఎల్ లో కేఎల్ రాహుల్‌‌‌‌కు ఇది నాలుగో సెంచరీ. ఇందులో మూడు ముంబైపైనే చేశాడు. ఒకే టీమ్​పై మూడు సెంచరీలు కొట్టిన తొలి ప్లేయర్​గా రికార్డు సృష్టించాడు.