ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, వెలుగు: నాలుగు రోజుల మేడారం మహాజాతర గ్రాండ్ సక్సెస్ అయిందని మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆనందం వ్యక్తం చేశారు. వన దేవతల కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పామని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన ఆఫీసర్లపై చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. బడుగుల దేవుళ్లను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, తప్పుడు ప్రచారాలు చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జాతర చివరి రోజన శనివారం తల్లుల వనప్రవేశం అనంతరం ఆమె మీడియా తో మాట్లాడారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పర్యవేక్షణలో మాస్టర్‌ప్లాన్ పనులు సకాలంలో పూర్తి చేసి భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా భక్తులకు నిజాలు తెలుసని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. పూజారులు, ఆదివాసీ యువత జాతర సక్సెస్ లో తమవంతు పాత్ర పోషించారని అభినందించారు. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేస్తామని చెప్పారు.
