అశ్వారావుపేట, వెలుగు: గిరిజన, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో అశ్వారావుపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ఎమ్మెల్యే.. సీఎంను కలిసి ప్రత్యేక వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. అశ్వారావుపేట నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతం కావడంతో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించాలంటే ఇతర జిల్లాలు లేదా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే వివరించారు.
ఆర్థికంగా వెనుకబడిన అనేక మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లలేక సాంకేతిక విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. అశ్వారావుపేటలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేస్తే అశ్వారావుపేటతో పాటు దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు
ఎమ్మెల్యే తెలిపారు.
