స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి : మీనాక్షి నటరాజన్

స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి : మీనాక్షి నటరాజన్
  • మెజారిటీ స్థానాల్లో మనమే గెలవాలి
  • చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోతున్నాం
  • సర్కార్​ స్కీమ్​లను ప్రజలకు వివరించాలి
  • లీడర్లు యాక్టివ్​గా ఉంటేనే కేడర్​లో జోష్
  • పది ఉమ్మడి జిల్లాల ఇన్​చార్జ్​లతో వేర్వేరుగా భేటీ

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచించారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా చూడాలన్నారు. దీని కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. హైదరాబాద్ హైదర్​గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్​లో 10 ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్​చార్జ్​లు, పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ల బాధ్యులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి నటరాజన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశాలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన భేటీలు.. రాత్రి వరకు కొనసాగాయి.

అనంతరం నేతలను ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడారు. ‘‘42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర సర్కార్ చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలి. సన్న బియ్యం, రేషన్ కార్డుల పంపిణీ గురించి ఇంటింటికెళ్లి ప్రచారం చేయాలి. సామాజిక న్యాయమే ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకోవాలి. కుల గణన చేసి దేశానికే తెలంగాణ ప్రభుత్వం రోల్ మోడల్​గా నిలిచింది. ఇది ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణం. దీన్ని ప్రతి కార్యకర్త ప్రజలకు తలెత్తుకుని ధైర్యంగా చెప్పాలి’’అని మీనాక్షి నటరాజన్ అన్నారు.

పాదయాత్రను సక్సెస్ చేయండి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రంగారెడ్డి జిల్లా పరిగిలో గురువారం పాదయాత్ర ప్రారంభం అవుతదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. శ్రమదానం కార్యక్రమాన్ని విజయంతం చేయాలని పార్టీ నేతలను కోరారు. సమీక్షా సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆగస్టు 6న వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో పాదయాత్ర ముగుస్తది. మీనాక్షి నటరాజన్, నేను ఈ పాదయాత్ర, శ్రమదానంలో పాల్గొంటాం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వ పథకాలను వివరించాలి’’అని మహేశ్ గౌడ్ సూచించారు. 

నియోజకవర్గానికి రెండు నామినేటెడ్ పోస్టులు

ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 2 నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ నిర్ణయించారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయం పాటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 60 శాతం పదవులను 50 ఏండ్లలోపు వారికే ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు. ఒకట్రెండు రోజుల్లో సీఎం రేవంత్​తో మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ సమావేశం కానున్నారు. పార్టీ పదవులను కూడా వీలైనంత త్వరగా భర్తీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

జూబ్లీహిల్స్​లో మనమే గెలవాలి

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్​లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మీనాక్షి నటరాజన్ అన్నారు. ‘‘పాత, కొత్త నేతలు సమన్వయంతో ముందుకెళ్లాలి. లీడర్లు యాక్టివ్​గా ఉంటేనే కేడర్​లో జోష్ వస్తది. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధాలను ఎప్పటికప్పుడు ఖండించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాం. దీనిపై అందరూ దృష్టిపెట్టాలి. చేసిన మంచిని చెప్పుకోవడంలో పార్టీ వెనుకబడిపోతున్నది’’అని మీనాక్షి నటరాజన్ అన్నారు.