- మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్
కోరుట్ల, వెలుగు : ‘పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి.. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలి, కోరుట్లలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆయన వస్తే.. నేను కూడా వస్తాను’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ సవాల్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేటలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... చీరల పంపిణీపై బీఆర్‌ఎస్ లీడర్లు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల టైంలో ఎన్నో ప్రగల్భాలు పలికిన బీఆర్‌ఎస్ లీడర్లకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. పెట్రోల్ బంక్‌లు, సోలార్ సిస్టం, ఆర్టీసీ బస్సుల లీజులతో మహిళల ముఖాల్లో సంతోషం కనిపిస్తోందన్నారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల మాదిరిగానే స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు చేసిన పాపాలకు ఇప్పటికీ వడ్డీ కడుతున్నామన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల ప్రోసీడింగ్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్యప్రసాద్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఏఎంసీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి పాల్గొన్నారు.
