అగ్నిపథ్ స్కీంను వెంటనే రద్దు చేయాలె

అగ్నిపథ్ స్కీంను వెంటనే రద్దు చేయాలె

నిర్మల్ జిల్లా:  అగ్నిపథ్ స్కీంను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ ను రద్దు చేయాలని కోరుతూ సికింద్రాబాద్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వరంగల్ కు చెందిన రాకేశ్ అనే యువకుడు మృతి చెందగా... ఈ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ నాయకులు ఉన్నారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ ఆరోపించడాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టిఆర్ఎస్ ఉంటే... బీహార్, హర్యానా, యూపీ అల్లర్ల వెనుక అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే ఉన్నాయా అని ప్రశ్నించారు. మోడీ పాలనలో దేశం ఆగమైందని, కేంద్ర ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మంత్రి ఆరోపించారు. నల్ల చట్టాలతో రైతులు, అగ్నిపథ్ స్కీంతో యువకులను కేంద్రం పొట్టన పెట్టుకుంటోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలకు మోడీ స్వస్థి పలకాలన్నారు. అగ్నిపథ్ కు వ్యతిరేకంగా యువత కదం తొక్కుతోందని అన్నారు. అగ్నిపథ్ స్కీంను రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు.