గణపతీ.. లొంగిపో..  సీఎం రేవంత్ రెడ్డి సూచన.. సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

గణపతీ.. లొంగిపో..  సీఎం రేవంత్ రెడ్డి సూచన.. సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు
  • అజ్ఞాతంలో ఉన్న మరో ఆరుగురూ సరెండర్  కావాలని హితవు
  • ఆత్మగౌరవంతో జీవించేలా చూసే బాధ్యత ప్రభుత్వానిది
  • చట్టపరిధిలో అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తామని హామీ
  • సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు
  • 31 ఏకే 47, 21 ఇన్‌‌సాస్‌‌  రైఫిల్స్ సహా 124 ఆయుధాలు అప్పగింత

హైదరాబాద్‌‌, వెలుగు: మావోయిస్టు అగ్రనేత గణపతి సహా తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్న ఏడుగురు మావోయిస్టులూ లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్‌‌ రెడ్డి పిలుపునిచ్చారు. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని, శాంతి చర్చలతోనే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆయన సూచించారు. లొంగిపోయిన వారి ప్రాణాలకు రక్షణ కల్పించడంతో పాటు ఆరోగ్యం, పునరావాసం, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే విధంగా తమ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీలో వివిధ కేడర్లలో పనిచేస్తున్న మొత్తం 130 మంది శనివారం సీఎం రేవంత్‌‌ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. 124 ఆయుధాలు సహా 7 వేల బుల్లెట్లను వారు సరెండర్‌‌  చేశారు.

శనివారం బంజారా హిల్స్‌‌లోని కమాండ్‌‌  కంట్రోల్‌‌  సెంటర్‌‌  ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌‌తో పాటు డీజీపీ శివధర్‌‌ రెడ్డి, ఇంటిలిజెన్స్‌‌  అడిషనల్‌‌  డీజీ విజయ్‌‌ కుమార్‌‌, ఆపరేషన్స్‌‌  అడిషనల్‌‌ డీజీ అనిల్‌‌ కుమార్‌‌, ఎస్‌‌ఐబీ చీఫ్‌‌, ఐజీ సుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌‌‌‌  పలు అంశాలపై మాట్లాడారు. గాంధీ బాటలోనే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని  స్పష్టం చేశారు. సాయుధ బలగాలైనా, మావోయిస్టులైనా దేశ పౌరులేనని, ఎవరి ప్రాణానికీ నష్టం జరగవద్దన్నదే తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు చట్టపరిధిలోని కేసులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేస్తామని వెల్లడించారు.

ఏ పార్టీలోనైనా చేరే స్వేచ్ఛ మావోయిస్టులకుంది 

లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘వారివారి జీవన విధానాన్ని నిర్ణయించుకునే అధికారం, హక్కు మావోయిస్టులకే ఉంటాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారా? లేక కుటుంబ సభ్యులతో  గడుపుతారా? అన్నది వారి స్వేచ్ఛ. మంత్రి సీతక్క సహా ఎంతో మంది అట్లా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. ఎవరి ఇష్టం వాళ్లది. వాళ్లలో ఎవరైనా కాంగ్రెస్‌‌‌‌  పార్టీలో  చేరాలనుకుంటే గాంధీ భవన్‌‌‌‌లో పార్టీ అధ్యక్షుడు మహేశ్‌‌‌‌ గౌడ్‌‌‌‌ అందుబాటులో ఉంటారు. అక్కడ కలిసి ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. వాళ్ల అభీష్టం మేరకు ఇతర రాజకీయ పార్టీలోనూ చేరవచ్చు” అని సీఎం రేవంత్  వ్యాఖ్యానించారు. ‘‘మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో చాలా మంది లొంగిపోయారు. ఆరోగ్య, ఆర్థిక భద్రతకు భరోసా ఇవ్వడం ద్వారా డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీపీ సుమతి వారిలో నమ్మకం కలిగించారు. వారి కృషి వల్లే130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందుకు డీజీపీ, ఐజీని ప్రత్యేకంగా అభినందిస్తున్నా” అని సీఎం తెలిపారు.

కొండపల్లి తర్వాత గణపతికే అంత గుర్తింపు

ఆయుధాలతో సహా లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి అమిత్‌‌‌‌ షా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని సీఎం రేవంత్  వెల్లడించారు. ‘‘కొండపల్లి సీతారామయ్య తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి. ఆయనకు 75 ఏండ్లకు పైగా వయస్సున్నందున ఆరోగ్యం బాగా లేదని అధికారులు చెప్పారు. సరెండర్  అయితే వారి ఆరోగ్యానికి, ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పిస్తాం.  వారితో పాటు సెంట్రల్ కమిటీ, స్టేట్‌‌‌‌ కమిటీ మెంబర్లు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిస్తున్నాం” అని సీఎం హితవు పలికారు. ఇటీవల లొంగిపోయిన దేవ్‌‌‌‌జీ, దామోదర్, చంద్రన్న, రాజిరెడ్డితో జరిపిన చర్చల వివరాలను సీఎం మీడియాకు వెల్లడించారు. వారంతా కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తెచ్చారని చెప్పారు. గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా.. వాళ్లు లేవనెత్తిన ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సిద్ధమైతే.. వారంతా లొంగిపోయేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారని వెల్లడించారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే  సీపీఐ(ఎంఎల్‌‌‌‌) ను పూర్తి స్థాయిలో రద్దు చేస్తామని పేర్కొన్నట్లు చెప్పారు. అలాగే రివార్డులు పెంచాలని, వైద్య సహాయం, పునరావాసం, వ్యవసాయం కోసం భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. దేవ్‌‌‌‌జీ సహా లొంగిపోయిన అగ్రనేతల ఆలోచనలు, ఆవేదనను తాము అర్థం చేసుకున్నామని సీఎం చెప్పారు. లొంగిపోయిన వారికి నిమ్స్‌‌‌‌ లాంటి హాస్పిటల్స్‌‌‌‌లో మెరుగైన వైద్యం అందిస్తామని, రివార్డుల విషయంలో వారి హోదాను బట్టి చర్యలు తీసుకుంటామని, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడమే కాకుండా స్వగ్రామాల్లో ఇండ్ల జాగలు కేటాయిస్తామని సీఎం భరోసా కల్పించారు.  “రాష్ట్ర స్థాయిలో చేయదగిన పనులు మేం చేస్తున్నాం. కానీ, కేంద్రం పరిధిలోని అంశాలపై మేము హామీ ఇవ్వలేం అని దేవ్‌‌‌‌జీ  బృందానికి చెప్పినం’’ అని  సీఎం తెలిపారు. 

దేవ్‌‌‌‌జీ ప్రతిపాదనలు అమిత్‌‌‌‌ షాతో చర్చించాం

సెంట్రల్ కమిటీ మెంబర్స్‌‌‌‌  తీసుకువచ్చిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రి అమిత్‌‌‌‌ షాతో చర్చించామని సీఎం రేవంత్  తెలిపారు. ‘‘ఆయుధాలతో సహా లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ క్రమంలోనే అధునాతన ఆయుధాలు, ఏడు వేల బుల్లెట్లతో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 2024 తర్వాత 721 మంది నక్సలైట్లు 250కి పైగా ఆయుధాలు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించిన రివార్డులు అందించాం’’ అని సీఎం చెప్పారు. రాష్ట్రంలో హింసకు తావులేదని, లొంగిపోయిన మావోయిస్టులు హింసకు పాల్పడినా, ఆయుధాలను తమ దగ్గర పెట్టుకున్నా కఠినంగా వ్యవహరించాలని అమిత్‌‌‌‌షా చెప్పారని సీఎం పేర్కొన్నారు. అలాంటి వారిపై ఎన్‌‌‌‌ఐఏ లాంటి జాతీయ సంస్థలే కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయని సీఎం తెలిపారు.

లొంగిపోయింది వీళ్లే

పీపుల్స్‌‌‌‌ లిబరేషన్‌‌‌‌  గెరిల్లా (పీఎల్‌‌‌‌జీఏ) మొదటి బెటాలియన్‌‌‌‌కు చెందిన ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజనల్‌‌‌‌ కమిటీ సభ్యులు, 18 మంది ఏరియా కమిటీ సభ్యులు, 19 మంది దళ సభ్యులు కలిపి 42 మంది...తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన ఇద్దరు డివిజనల్‌‌‌‌ కమిటీ సభ్యులు , 12 మంది ఏరియా కమిటీ సభ్యులు, 16 మంది దళసభ్యులు కలిపి మొత్తం 30 మంది, దండకారణ్యం స్పెషల్‌‌‌‌ జోనల్‌‌‌‌ కమిటీకి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఒకరు, డివిజనల్‌‌‌‌ కమిటీ సభ్యులు ముగ్గురు, ఏడుగురు ఏరియా కమిటీ సభ్యులు, 21 మంది దళ సభ్యులు కలిపి 32 మంది, రెండో సెంట్రల్‌‌‌‌  రీజినల్‌‌‌‌ కమాండ్‌‌‌‌  చెందిన ఇద్దరు డివిజనల్‌‌‌‌ కమిటీ సభ్యులు, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు, 10 మంది దళ సభ్యు లు కలిపి 16 మంది, సెంట్రల్‌‌‌‌ కమిటీ సభ్యులు వద్ద పనిచేసిన వారిలో  ఒకరు రీజినల్‌‌‌‌ కమిటీ సభ్యుడు, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, నలుగురు దళ సభ్యులు కలిపి మొత్తం 10 మంది ఉన్నారు. కాగా, శనివారం లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నారు. వీరి వద్ద ఉన్న ఒక ఇన్‌‌‌‌సాస్ ఎల్‌‌‌‌ఎంజీ రైఫిల్‌‌‌‌,  31 ఏకే -47 రైఫిళ్లు,  21 ఇన్‌‌‌‌సాస్‌‌‌‌ రైఫిళ్లు,  20 ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ రైఫిళ్లు,  18.. 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులను పోలీసులకు అప్పగించారు. వీటితోపాటు 5205 తుటాలను  అప్పగించారు.