నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది.. విలీనం వద్దని నాన్నకు చెప్పిన: కవిత

నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది.. విలీనం వద్దని నాన్నకు చెప్పిన: కవిత
  • అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకుని ఉంటే పార్టీ ఉండేదా?
  • పార్టీని టార్గెట్​ చేసేందుకే నాపై కేసు.. జైలు నుంచి వచ్చాక పార్టీ మద్దతు ఇవ్వలే
  • నాకు న్యాయం జరిగిందని నెల్లూరు పెద్దారెడ్డిలా కేటీఆర్​ చెప్పుడేంది?
  • ‘వీ6 వెలుగు’ కు తెలంగాణ జాగృతి చీఫ్ ప్రత్యేక ఇంటర్వ్యూ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ పార్టీ ఉందంటే దానికి కారణం తానే అని తెలంగాణ జాగృతి చీఫ్  కవిత అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బీఆర్ఎస్​ పార్టీని టార్గెట్  చేసి తనపై లిక్కర్​ కేసు పెట్టినా దృఢ సంకల్పంతో పోరాడానని, బీజేపీలో బీఆర్ఎస్​ను విలీనం చేస్తే తనను విడుదల చేస్తారని చెప్తే ఆ ప్రతిపాదనను తిరస్కరించానని ఆమె వెల్లడించారు.

‘‘నేను ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా తిరిగివస్తానని మా తండ్రి కేసీఆర్​కు ఫోన్​లో చెప్పాను. ఆనాడు నేను నా స్వార్థం కోసం, బయటకు రావడం కోసం విలీనానికి ఒప్పుకుని ఉంటే ఇవాళ బీఆర్ఎస్​ ఉండేదా?’’ అని ఆమె ప్రశ్నించారు. పార్టీ కోసం తాను నిలబడ్డానని, కానీ.. జైలు నుంచి బయటకొస్తే నేతలెవరూ తనకు నైతికంగా మద్దతు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మన అనుకున్నోళ్లే అండగా నిలవనప్పుడు తన అత్తామామల ముందు ఎంత అవమానంగా ఉంటుందో అర్థంచేసుకోవాలన్నారు. లిక్కర్​ స్కామ్  కేసులో జైలుకు పోవడానికి ముందు రెండేండ్ల పాటు తాను ఒంటరిగానే ఫైట్​ చేశానని, పార్టీ నుంచి తనకు ఎలాంటి మద్దతూ లభించలేదని ఆరోపించారు. అదే ఆప్​ నేతలు.. తమ నేతల కోసం ప్రెస్​మీట్లు పెట్టి, కేసును ఖండించి అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. లిక్కర్​ కేసు నుంచి బయటపడడం, రాజకీయ పార్టీ ఏర్పాటు వంటి అంశాలపై కవిత  ‘వీ6 వెలుగు’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే..

వీ6 వెలుగు: లిక్కర్​ కేసులో రిలీఫా.. బిగ్​ రిలీఫా? కోర్టు తీర్పు వచ్చాక ఎలా అనిపిస్తున్నది? 
కవిత: సత్యం జయిస్తదని నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం నిజమైనందుకు సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్లెవరో, పరాయి వాళ్లెవరో తెలుస్తుంది. నాలుగేండ్లు ఎన్నో కష్టాలు అనుభవించిన. దీంతో నాకు మనోళ్లెవరు, మంది ఎవరన్నది క్లారిటీ వచ్చింది. అంత కష్టంలోనూ భరించే శక్తిని ఆ దేవుడు నాకు ఇచ్చిండు. నా కష్టంలో అడుగడుగునా నాకు తోడునీడగా నా భర్త, అమ్మానాన్న, పిల్లలు, అత్తామామలు, జాగృతి కార్యకర్తలు అండగా నిలిచారు. రాజకీయంగా పక్కవాళ్లు బురద జల్లడం కామన్​. కానీ, మనోళ్లు కూడా అదే పనిచేశారు. దాని నుంచి మనోళ్లు అనుకున్నవాళ్లు కూడా రక్షించలేకపోయారన్న బాధ ఉంది. 

వీ6 వెలుగు: కష్టకాలంలో కవిత వెంట ఉన్నామని బీఆర్ఎస్​ నేతలు చెబుతున్నారు కదా. మరి, కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇదే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోయారు?
కవిత: జైలుకు వెళ్లినప్పుడు లాయర్​ ఫీజు కూడా ఫస్ట్​ చెక్​ మా నాన్న ఇచ్చారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్లారు. కానీ, అంతకు ముందు రెండేండ్ల దాకా కూడా నాకు సపోర్ట్​ ఏం రాలేదు. ఆప్  నాయకులతో పోలిస్తే మా వాళ్లు ఇచ్చిన సపోర్ట్​ లేదు. నాకేమీ సోషల్​ మీడియా ఆర్మీ లేదు. నేను ఒంటరి పక్షిని. బీఆర్ఎస్​లో ఉన్నా.. ఇప్పుడు బయటకొచ్చినా నేను ఒంటరి పక్షిని. పార్టీ నుంచి డిఫెన్స్​ లేకపోవడంతో యూట్యూబ్​ చానెళ్లు, టీవీ చానెళ్లు.. ఒక ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఎంత మాట్లాడొచ్చో అంత మాట్లాడారు. వాళ్లందరికీ కోర్టు తీర్పు చెంపపెట్టు. లిక్కర్​ కేసు వల్లే ఓడిపోయామని నిరంజన్​ రెడ్డి, మాధవరం కృష్ణారావు వంటి వాళ్లు అన్నారు. కేటీఆర్​ కూడా.. లిక్కర్​ కేసుతోనే బీఆర్ఎస్​ ఓడిపోయిందని చెప్పారు.

 నేను జైలులో ఉన్నప్పుడు బీఆర్ఎస్​ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. విలీనం చేస్తే నేను తొందరగా బయటకొస్తానని చెప్పారు. కానీ, పార్టీని ఎట్టిపరిస్థితుల్లో విలీనం చేయొద్దని చెప్పాను. మా నాన్నకేసీఆర్ కు ఫోన్​పార్టీని విలీనం చేయొద్దని చెప్పాను. పార్టీ కోసమే నేను అంత బలంగా నిలబడ్డాను. 

వీ6 వెలుగు: కేసీఆర్​ ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తారా?
కవిత: కచ్చితంగా కేసీఆర్​ ఫొటో లేకుండానే ముందుకు పోతాను.

వీ6 వెలుగు: కోర్టు తీర్పు తర్వాత అమ్మను కలిశారా? కేసీఆర్​ ఎంతో మానవతావాది అంటుంటారు. మరి సొంత కూతురి విషయంలో ఆయన ఇలా ఉన్నారు? 
కవిత: కలవలేదు. ఫోన్​ చేశాను. చాలా సంతోషపడింది. ఈ టాపిక్​ నుంచి కేసీఆర్​ను పక్కనపెడదాం. ఆయన ఎందుకు రియాక్ట్​ అవుతలేరన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. జవాబులు వెతికే క్రమంలో లేనిపోని విషయాలు నేనేమీ అనదలచుకోలేదు.

వీ6 వెలుగు: కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్​ ట్వీట్​ చేశారు కదా? మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే చాన్స్​ ఏమైనా ఉందా?
కవిత: నాకు కోర్టులో న్యాయం జరిగింది. పార్టీలో జరిగిందా? కవితకు న్యాయం జరిగిందని కేటీఆర్​ చెప్పుడేంది? ఏదో పెద్ద నెల్లూరు పెద్దారెడ్డిలాగా. పార్టీలో న్యాయం జరగలేదు కదా! దాని గురించి కేటీఆర్​ ఆలోచించాలి. బీఆర్ఎస్​ లోకి ఇంక వెళ్లేది లేదు. 

వీ6 వెలుగు: పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్, సంతోష్​ ఉండగా.. ఢిల్లీ లిక్కర్​ కేసులో కేవలం కవితనే ఎందుకు టార్గెట్​ చేశారు?
కవిత: ‘నన్ను ఏం చేయలేకనే.. వాళ్లు నా బిడ్డ మీద పడ్డరు’ అని కేసీఆర్​ ఆనాడే చెప్పారు. పార్టీ కోసం, పార్టీ నాయకుల కోసమే కదా నేను జైలుకు వెళ్లింది. అలాంటి పార్టీనే నాకు అండగా ఉండకుంటే నేను ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పటికీ బీఆర్ఎస్​ సోషల్​ మీడియా నాపై విచ్చలవిడిగా ఆరోపణలు చేస్తున్నది. కోర్టు తీర్పు వచ్చి ఓ గంట సంతోషంగా ఉన్నానో లేదో.. కేటీఆర్​ ట్వీట్​ చేశారు. అంటే నేను నా ఫ్యామిలీతో ఒక్క గంట కూడా సంతోషంగా ఉండొద్దా? నేను జైలుకు వెళ్లినప్పుడు పార్లమెంట్​ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. సరే నా వల్లే పార్టీ ఓడిపోయిందనుకుంటే.. మరి, అంతకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు? 

వీ6 వెలుగు: పార్టీ పెడతామని మీరు అనౌన్స్​ చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందా?
కవిత: కాంగ్రెస్​ ప్రభుత్వం మంచిగా పనిచేస్తున్నదని భావిస్తున్నారా మీరు? బీఆర్ఎస్​ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నదా? కాంగ్రెస్​ పాలన బాగాలేదు అని ప్రజలు మొత్తుకుంటున్నారు. మరి, ప్రజలే కాంగ్రెస్​కు ఓట్లేసి ఎందుకు గెలిపిస్తున్నరు. 

కాంగ్రెస్​ తప్పులను ఎత్తిచూపడంలో ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్​, బీజేపీ ఫెయిల్​ అయ్యాయి. ప్రతిపక్షం లేని రాష్ట్రం ముందుకు వెళ్లదు. దాని వల్ల కాంగ్రెస్‌కు నష్టమేం ఉండదు. ప్రజలకే నష్టం. కాబట్టి మా పార్టీకి ప్రజల దీవెనలు ఉంటాయని నమ్ముతున్నాం. ఇక రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది. అన్నలు ప్రాణాలతో వచ్చి వేరే రూపంలో పోరాటం చేస్తామని చెప్పడం సంతోషం. దీనివల్ల ఐడియాలజీని బతికించుకోవచ్చు. మేము కూడా వాళ్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రెండు నెలల్లో మేం పార్టీ పెడుతున్నం. మాతో కలిసి పనిచేయాలని వాళ్లకు నేను ఓపెన్​ ఆఫర్​ ఇస్తున్నా.