ఏపీ విజయ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి

ఏపీ విజయ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి
  • ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇచ్చారు..
  • ఏపీ ప్రభుత్వంపై  తెలంగాణ విజయ డెయిరీ  చైర్మన్ గుత్తా అమిత్‌‌రెడ్డి ఫైర్‌‌‌‌
  • విజయ డెయిరీ పేరుతో కల్తీకి పాల్పడితే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇవ్వడంతోనే  మార్కెట్లోకి కల్తీపాలు, కల్తీ నెయ్యి వస్తున్నాయని తెలంగాణ విజయ డెయిరీ డెవలప్‌‌మెంట్‌‌ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌‌రెడ్డి మండిపడ్డారు. విజయ డెయిరీ పేరుతో కల్తీ పాలు, పాల ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. హైదరాబాద్‌‌ లాలాపేటలోని విజయ భవన్‌‌లో శనివారం తెలంగాణ విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ కే చంద్ర శేఖర్‌‌‌‌రెడ్డితో కలిసి అమిత్‌‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అమిత్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. విభజన తర్వాత విజయ డెయిరీ కార్యకలాపాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాయని, అప్పటి నుంచి ఏపీ.. విజయ బ్రాండ్‌‌‌‌ను మిస్‌‌‌‌యూస్ చేస్తున్నదని,  మేఘనా ఫుడ్స్‌‌‌‌ అనే ప్రైవేట్‌‌‌‌ కంపెనీకి ఫ్రాంచైజీ ఇచ్చిందని తెలిపారు. వారు గుజరాత్‌‌‌‌లో నెయ్యి తయారు చేసి తెలంగాణలో అమ్ముతున్నారని అన్నారు. మేఘనా ఫుడ్స్ సరఫరా చేసే  నెయ్యిలో వెజిటెబుల్‌‌‌‌ ఆయిల్ ఉన్నట్టు నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు(ఎన్డీడీబీ)  రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు.  రైస్‌‌‌‌బ్రాన్‌‌‌‌, పామాయిల్‌‌‌‌లాంటి నూనెలు కలిపి కల్తీ చేస్తున్నట్టు తెలిపారు. నెయ్యి అంటే ఆవు లేదా గేదెల ద్వారా వచ్చే పాలతో తయ్యారు చేస్తామన్న విశ్వాసంతోనే  ప్రజలకు, టెంపుల్స్‌‌‌‌కు అందిస్తామన్నారు.

హైదరాబాద్‌‌‌‌లో ప్రతి నెలా 100 టన్నుల నెయ్యి అమ్మకం జరుగుతుందని,  కల్తీపాలు, నెయ్యితో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే ప్రమాదముందని తెలిపారు. తెలంగాణలో విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో కృష్ణ యూనియన్  కల్తీపాలు, నెయ్యి అమ్ముతున్నదని చెప్పారు. పాలప్యాకెట్ మీద డీటెయిల్స్ స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీ వివరాలు వస్తున్నాయని,  ఆ సంస్థను ప్రశ్నిస్తే.. తాము అమ్మట్లేదని చెబుతున్నారని అన్నారు. డెయిరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు విజయ డెయిరీ పేరు వాడుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై  ఎన్నోసార్లు ఏపీ డెయిరీకి లేఖ రాసినా స్పందన లేదన్నారు.  

తెలంగాణ రైతులకు నష్టం జరిగితే ఊరుకోం..
రాష్ట్ర  డెయిరీ రైతులకు నష్టం జరిగితే ఊరుకోబోమని గుత్తా అమిత్‌‌‌‌రెడ్డి హెచ్చరించారు.  తమ పాడి రైతులకు అండగా ఉంటామని తెలిపారు. కల్తీ పాలు, నెయ్యి మీద  ఏపీ అసెంబ్లీలో రోజూ రచ్చ నడుస్తున్నదని, ఏపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలన్నారు. 

1904లో స్థాపించిన విజయ డెయిరీ..  రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నదని చెప్పారు.  ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా రోజుకు సుమారు 4 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించి వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పారు. కానీ, మార్కెట్‌‌‌‌లో విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాలు, పాల ఉత్పత్తులు విక్రయిస్తూ వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.

కల్తీ నెయ్యిలో ఉండే  కెమికల్స్.. పెద్దవారితోపాటు పిల్లల్లో సైతం గుండె జబ్బులకు కారణమవుతున్నాయన్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఫ్రాంచైజీ ఇచ్చిన   విషయంపై  ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకుంటే  రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. 

ప్రజలు అసలైన తెలంగాణ విజయ పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రస్తుతం బ్రాండ్ విభజన పూర్తికాలేదని, నాణ్యతాపరంగా ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నా రు.  సమావేశంలో విజయ డెయిరీ  సిబ్బంది పాల్గొన్నారు.