- సీసీఎల్‌ఏ నేతృత్వంలో హైపవర్ కమిటీ: మంత్రి పొంగులేటి
- ఎల్బీనగర్ సెగ్మెంట్లో ఇవాళ్టి నుంచే
- 9,700 ప్లాట్ల రెగ్యులరైజేషన్
- జీవో 76 ప్రకారం సింగరేణి స్థలాల్లో
- ఇండ్ల జాగాల క్రమబద్ధీకరణ
- 22ఏలో ఉండి హెచ్ఎండీఏ,
- డీటీపీసీ, జీహెచ్‌ఎంసీ పర్మిషన్తో
- చేసిన లే అవుట్లలోని ప్లాట్లపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం
- సీఎం ప్రకటించిన 12 అంశాలపై నెల రోజుల్లో రిలీఫ్
హైదరాబాద్, వెలుగు: 22-ఏ కు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు శుక్రవారం అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ నిషేధిత జాబితా కారణంగా ఏండ్ల తరబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది బాధితులకు ఊరట కలుగుతుందని పేర్కొన్నారు. 22-ఏ సమస్యల సత్వర పరిష్కారానికి ముగ్గురు ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన హైలెవల్ కమిటీలో సీసీఎల్‌ఏ కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ చైర్మన్‌గా, న్యాయశాఖ కార్యదర్శి పాపిరెడ్డి, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ సభ్యులుగా ఉన్నారన్నారు. నిషేధిత భూముల పరిధిలోని సుమారు 12 రకాల సంక్లిష్ట సమస్యలను గరిష్టంగా నెల రోజుల్లో పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు సామాన్యులు, మధ్యతరగతి ప్రజల హక్కులకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం చరిత్రాత్మక ముందడుగు వేసిందని, ఏండ్ల నాటి సమస్యలకు యుద్ధప్రాతిపదికన తెరదించుతామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఎల్బీనగర్ పరిధిలో 9,792 దరఖాస్తులకు నెలరోజుల్లో మోక్షం
అసెంబ్లీలో ఈ నెల 16న జరిగిన స్వల్పకాలిక చర్చకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించి ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో జీవో నం.118 ప్రకారం రెగ్యులరైజేషన్ కోసం అందిన 9,792 దరఖాస్తులను నెల రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ మెమో నం. 46940 జారీ చేశారని చెప్పారు. కోర్టు ఉత్తర్వులకు లోబడి రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్లు, సీసీఎల్‌ఏ తక్షణమే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్దేశించారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎల్బీనగర్‌లోని 22 నుంచి 23 కాలనీల బాధితులను 22-ఏ నిబంధనల నుంచి శాశ్వతంగా విముక్తి కల్పిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం అర్హులైన బాధితులందరికీ తానే స్వయంగా పట్టాలు పంపిణీ చేస్తానని మంత్రి వెల్లడించారు. సుదీర్ఘకాలంగా స్థలాల క్రమబద్ధీకరణ నోచుకోక, ఆస్తులను అమ్ముకోలేక అల్లాడుతున్న వేలాది కుటుంబాలకు ఈ నిర్ణయంతో శాశ్వత పరిష్కారం దక్కుతుందన్నారు.
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో ఒకటి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలతో పాటు ఇతర స్థానిక సంస్థల నుంచి అధికారికంగా లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులు పొందినప్పటికీ.. సాంకేతిక కారణాలతో 22-ఏ జాబితాలో చిక్కుకుపోయి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఆస్తులపైనా ఒకటి, రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఎలాంటి తప్పు చేయకపోయినా ఏండ్ల తరబడి రిజిస్ట్రేషన్లు కాక ఆర్థికంగా నలిగిపోతున్న అమాయక ప్లాట్ల యజమానులను ఆదుకునేందుకు కసరత్తు పూర్తయిందని మంత్రి పొంగులేటి తెలిపారు. అధికారిక అనుమతులున్న ఆస్తుల వివరాలను కమిటీ ద్వారా వడపోసి, వాటిని నిషేధిత జాబితా నుంచి మినహాయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఆయా బాధితులకు పూర్తిస్థాయి సాంత్వన చేకూర్చేలా రాబోయే కొద్ది రోజుల్లోనే సమగ్రమైన మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక జీవోను జారీ చేయబోతున్నామని సభకు హామీ ఇచ్చారు.
సింగరేణి ప్రాంతాల్లో కట్టుకున్న ఇండ్ల రెగ్యులరైజేషన్..
సింగరేణి బొగ్గు గనుల విస్తరణ ప్రాంతాలు, పరిసర నియోజకవర్గాల్లో తరచూ తలెత్తుతున్న భూ వివాదాల పరిష్కారంపైనా సర్కారు ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొంగులేటి చెప్పారు. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన భూ సమస్యలపై శుక్రవారమే విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించినట్టు మంత్రి తెలిపారు.
సింగరేణి ప్రాంతంలో ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలో జీవో 76ను జారీ చేశారని.. ఆ జీవో ప్రకారమే క్రమబద్ధీకరిస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఆధ్వర్యంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించారు. అలాగే, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన 10–12 అంశాలపై నెలరోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసుకొని 22ఏ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పిస్తామని చెప్పారు. నిషేధిత ఆస్తుల అంశంలో గత పాలకులు సృష్టించిన గందరగోళాన్ని తొలగించి, పారదర్శకమైన వ్యవస్థను తీసుకురావడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ నిర్దేశిత 30 రోజుల గడువులోగా పూర్తి న్యాయం జరిగేలా యంత్రాంగం క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
