దమ్ముంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలె..ఎవరు ఎవర్ని ఇరగదీస్తారో తేల్చుకుందాం: పొంగులేటి

దమ్ముంటే ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలె..ఎవరు ఎవర్ని ఇరగదీస్తారో తేల్చుకుందాం: పొంగులేటి
  •  
  • బావ, బావమరిది తొడలు కొడితే భయపడం
  • పదేండ్ల దోపిడీ, 22ఏపై లెక్కలు తేల్చేద్దాం
  • అడ్డంకులెన్ని ఎదురైనా సంక్షేమం ఆపం
  • త్వరలో 3 లక్షల మందికి కొత్త పింఛన్లు
  • ఆర్థిక కష్టాల్లోనూ 1000 రోజులు సుపరిపాలన
  • మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న కేసీఆర్.. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  మండిపడ్డారు. ‘‘నిజంగా దమ్ముంటే ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి రావడానికి ఎందుకు భయపడుతున్నడు. మీ పదేండ్ల పాలనలో చేసిన రూ.8.21 లక్షల కోట్ల అప్పులు, కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు, పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టిన రూ.40 వేల కోట్ల బిల్లులపై సభ సాక్షిగా చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మేం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై పూర్తి ఆధారాలు, పత్రాలతో లెక్కలు తేలుస్తాం. కొడుకు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, మేనల్లుడు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును మైకుల ముందుకు పంపి మైలేజ్ కోసం చూడటం మానుకుని.. సభకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం  కేసీఆర్​కు ఉందా? ప్రతిపక్ష నేత పగటి కలలు మానుకోవాలి” అని అన్నారు.


బుధవారం సెక్రటేరియెట్‌‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి మాట్లాడారు.  గత ఆరేడేండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న సుమారు 3 లక్షల మంది అర్హులకు త్వరలోనే కొత్త ఆసరా పెన్షన్లను మంజూరు చేయబోతున్నామని స్పష్టం చేశారు.  బీఆర్‌‌ఎస్‌‌ పదేండ్ల   పాలనలో రాష్ట్ర ప్రజలపై విపరీతమైన అప్పుల భారం మోపి ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. తాము ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెయ్యి రోజులు సుపరిపాలన అందించామని చెప్పారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ప్రతి నెలా అసలు, వడ్డీల రూపంలోనే సుమారు రూ.6,500 కోట్లను చెల్లిస్తూనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలు చేస్తున్నదని తేల్చి చెప్పారు.

‘యాడ సచ్చినవ్‌‌’ అంటే ఊరుకునేది లేదు 

బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి మండిపడ్డారు. బావా బావమరిది ఇద్దరూ చెరొక తొడ కొట్టుకుంటూ ప్రభుత్వంపై ప్రగల్భాలు పలుకుతున్నారని, వారి తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. అమెరికా, విదేశాల్లో చదువుకున్నానని చెప్పుకునే కేటీఆర్..  రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌‌రెడ్డిపై ‘యాడ సచ్చినవ్’ అంటూ అహంకారంతో సంస్కారహీనమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  గతంలో పినపాక, మణుగూరులో కుర్చీ వేసుకుని కూర్చుని పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఎన్నికలయ్యాక ముఖం చాటేశారని విమర్శించారు. భద్రాచలం రాముడి సాక్షిగా టౌన్‌‌కు రూ.వెయ్యి కోట్లు, గుడికి రూ.100 కోట్లు ఇస్తామని దేవుడి పేరిట ఒట్టేసి పచ్చి అబద్ధాలు ఆడిన చరిత్ర వారిదన్నారు.  భూ సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. ‘భూ భారతి’ని తెచ్చి పేద రైతుల భూములకు శాశ్వత రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు మున్సిపాలిటీల్లో 85 శాతం, గ్రామ పంచాయతీల్లో 75 శాతానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్‌‌ను గెలిపించి ప్రజలు తీర్పు ఇచ్చినా ప్రతిపక్షాలకు జ్ఞానోదయం కలగలేదని అన్నారు.

పేదలకు రక్షణగా ‘భూ భారతి’

గత పాలకులు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడితే, తమ ప్రభుత్వం అన్నదాతను నిజమైన రాజును చేసే దిశగా అడుగులు వేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రైతు సంక్షేమం కోసమే రికార్డు స్థాయిలో రూ.1,76,050 కోట్లను వెచ్చించినట్టు వెల్లడించారు. పంజాబ్‌‌ను సైతం అధిగమించి దేశంలోనే అత్యధికంగా వరి పండించే అగ్రగామి రాష్ట్రంగా అవతరించామన్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారంలో తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రి వివరించారు.  

ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇదొక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. గతంలో అద్దె భవనాలు, మూతపడ్డ కోళ్ల ఫారాలు, రైస్ మిల్లుల్లో రెసిడెన్షియల్ పాఠశాలలను బోర్డులకే పరిమితం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 85 నియోజకవర్గాల్లో ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో కూడిన ‘తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్’ నిర్మాణ పనులను వేగవంతం చేశామని వెల్లడించారు.   గత ప్రభుత్వం ఊరికి 40 కిలోమీటర్ల దూరంలో డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు కట్టి పేదలను ఇబ్బందులకు గురిచేస్తే.. తమ ప్రభుత్వం నగరంలోని కోర్ ఏరియాల్లో ఎకరం రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాల్లో ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మించి పేదల జీవనోపాధికి భరోసా కల్పిస్తోందన్నారు.