- ఏ కష్టమొచ్చినా సహాయం అందిస్తాం: మంత్రి వివేక్
- యంగ్ ఇండియా విజన్.. గ్లోబల్ స్కిల్స్‌తో దూసుకెళ్లండి
- జర్మన్ భాష వస్తేనే కెరీర్లో ‘టాప్ గేర్’..
- రాష్ట్రంలో ఆ లాంగ్వేజ్ నేర్పిస్తున్నం
- బెర్లిన్‌లో తెలంగాణ వాసులతో మంత్రి ముఖాముఖి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ముఖ్యంగా జర్మనీలో స్థిరపడిన యువతకు అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన, బెర్లిన్‌లో తెలంగాణ ప్రవాసులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువతను అంతర్జాతీయ నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, గ్లోబల్ స్కిల్స్ ఇంటిగ్రేషన్‌లో భాగంగా ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ‘యంగ్ ఇండియా’ విజన్‌లో భాగంగా యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. జర్మనీలో విద్య, ఉపాధి కోసం వచ్చిన తెలంగాణ విద్యార్థులకు, నిపుణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం తరఫున పరిపాలన, న్యాయ, వృత్తిపరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కొత్త ఇన్నోవేషన్స్‌తో గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రవాసుల అవసరాలకు ఒక వారధిలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
జర్మనీలో వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే జర్మన్ భాషపై పట్టు సాధించడం అత్యవసరమని మంత్రి సూచించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత స్థాయి కెరీర్ అవకాశాలు పొందాలంటే భాషా పరిజ్ఞానం ప్రాథమిక అవసరమని గుర్తుచేశారు. స్థానిక వృత్తిపరమైన వాతావరణంలో త్వరగా ఇమిడిపోవడానికి, సాంస్కృతిక అనుసంధానానికి జర్మన్ భాష ఒక శక్తివంతమైన సాధనమని, ప్రవాసులు దాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌లో తెలంగాణ విద్యార్థులను విజేతలుగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వినూత్న చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు జర్మన్ భాషలో ప్రాథమిక శిక్షణ ఇచ్చేలా ప్రత్యేక భాషా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ, మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు.
