బడి గడప తొక్కని హెచ్ఎంపై వేటు

బడి గడప తొక్కని హెచ్ఎంపై వేటు
  • విట్యాలకు స్వయంగా వెళ్లి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విచారణ
  • నిర్లక్ష్యం తేటతెల్లం కావడంతో సస్పెన్షన్​
  • కొత్త టీచర్ నియామకం

షాద్​నగర్​, వెలుగు:  రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్ మండలం విట్యాల జడ్పీహెచ్ఎస్ ఇన్​చార్జీ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం ఎ. రవికుమార్​ను విద్యాశాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ‘బడి గడప తొక్కని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం’ పేరుతో బుధవారం వెలుగు దినపత్రికలో వచ్చిన కథనంపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పందించారు. డీఈఓ సుశీందర్​తో కలిసి స్వయంగా పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి విద్యార్థులు, ఇతర సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజులుగా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం బడికి రావడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. రవికుమార్ ఇంగ్లీష్ సబ్జెక్టు టీచర్​గా విధులు నిర్వహిస్తూనే ఇన్​చార్జీ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంగా కొనసాగుతున్నారు.

ఆయన ప్యానల్ ఇన్​స్పెక్షన్ టీములో ఉన్నప్పటికీ సుమారు నెలరోజులుగా తనిఖీలు లేవు. ప్రాథమిక విచారణలో ఆయన నిర్లక్ష్యం స్పష్టంగా తేలడంతో నవీన్ నికోలస్ కఠిన చర్యలకు ఆదేశించారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన రవికుమార్​ను సస్పెండ్ చేశారు. షాద్​నగర్ గర్ల్స్ హైస్కూల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లీష్) అమరేశ్వర్​ను విట్యాల హైస్కూల్​కు వర్క్ అడ్జస్ట్​మెంట్ కింద డిప్యూట్ చేస్తూ డీఈవో సుశీందర్ ఆదేశాలు జారీ చేశారు. బడికి రాకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

విద్యార్థుల నుంచి డబ్బులు!

మరోవైపు రవికుమార్​పై పలు రకాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలకు రాకపోవడమే కాకుండా, కనీసం పాఠశాల ఆవరణ, టాయిలెట్లను శుభ్రం చేయించడంలో అలసత్వం వహించారని, గ్రామ ప్రజలతో దురుసుగా ప్రవర్తించారని తెలిసింది. పాఠశాలలో ఒక్కో విద్యార్థి వద్ద రూ.300 అదనంగా వసూలు చేసి అకౌంట్ మెయింటైన్ చేశారని విద్యార్థులు, గ్రామస్తులు ఆరోపించారు.