- 2023లో కాంగ్రెస్‌లో చేరిక
- జనంలో ఉంటూ, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా జయకేతనం
హైదరాబాద్, వెలుగు: దాదాపు పదహారేండ్ల కింద రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నవీన్ యాదవ్.. తన కలను సాకారం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ గడ్డపై ఎమ్మెల్యేగా గెలిచి.. అత్యధిక మెజార్టీతో రికార్డు సృష్టించారు. రాజకీయాల్లోకి ఆయన 2009లో అడుగుపెట్టారు. ఎంఐఎంలో ప్రస్తానం ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. 2023 నవంబర్‌లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్లో విజయకేతనం ఎగురవేశారు.
వ్యక్తిగత జీవితం: హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 1983లో నవీన్ యాదవ్ జన్మించారు. పూర్తి పేరు వల్లాల నవీన్ యాదవ్. తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్. నవీన్ యాదవ్ వృత్తి రీత్యా ఆర్కిటెక్ట్. భార్య వర్ష, కుమారుడు అన్ష్.
2023లో కాంగ్రెస్‌లో చేరిక
2023 నవంబర్ 15న అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకుంటూ.. సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులను చేయించారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్‌లో బైపోల్ జరిగింది. ఇందులో కాంగ్రెస్ అధిష్ఠానం.. యాదవ సామాజిక వర్గానికి చెందిన యువ నేత నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. అధిష్ఠానం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ కాంగ్రెస్ జెండాను ఆయన ఎగురవేశారు. 24,729 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ రికార్డ్ బ్రేక్ చేశారు.
రాజకీయ ప్రస్తానం: 2009లో యూసుఫ్‌గూడ డివిజన్లో ఎంఐఎం పార్టీ నుంచి కార్పొరేటర్‌గా నవీన్ యాదవ్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి మురళీగౌడ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. ఆయన 41,656 ఓట్లు (25.19 శాతం) సాధించి రెండో స్థానంలో నిలిచారు. తర్వాత ఎంఐఎం అభ్యర్థిగా రహమత్‌నగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పుడు ఆయన 18,817 ఓట్లు సాధించారు.
