కేంద్రం ధాన్యం కొంటామంటే మేమేమైనా వద్దన్నామా

కేంద్రం ధాన్యం కొంటామంటే మేమేమైనా వద్దన్నామా

హైదరాబాద్ : ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఇంత గందరగోళం సృష్టిస్తారా అన్నారు వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి. వరి సాగుపై గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. బీజేపీ ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు. యాసంగిలో  వరి ధాన్యాన్ని ఎన్ని క్వింటాలు కొంటుందో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదన్నారు. నిల్వలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము కొనుగోలు చేయలేమని కేంద్ర మంత్రులు చెప్పారన్నారు. గతంలో కొనుగోలు చేస్తామన్న  5 లక్షల  క్వింటాల ధాన్యం  ఇంకా కొనుగోలు చేయలేదని తెలిపారు.  యాసంగిలో  వడ్లు వేయకూడదని కేంద్రం చెప్పిందని.. కేంద్రం కొనకూడదు అని చెబితేనే మేము కొనుగోలు చేయడం లేదన్నారు.  రైతుల మీద ప్రేమతో  ఉచిత కరెంట్, రైతు బంధు, కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేశామని చెప్పారు.  కరోనా కష్ట కాలంలోనూ దేశంలో ఎక్కడా లేని విధంగా  వడ్లు కొనుగోలు చేశామని.. అనవసరంగా  బీజేపీ  థర్డ్ క్లాస్ రాజకీయాలు చేస్తుందన్నారు.  కేంద్రం కొనుగోలు చేస్తామంటే మేము కొనడం లేదా.. మీరు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వడ్లు  కొనుగోలు చేస్తామని హామీ వచ్చే వరికి బండి సంజయ్  దీక్ష చేయాలన్నారు.


 హుజురాబాద్ లో మిమ్ములను ప్రజలు తిరస్కరిస్తారన్న నిరంజన్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన  ఆణిముత్యాన్ని మేము నిలబెట్టామన్నారు. 
విలువలను వదులుకుని రాజేందర్  బీజేపీలో జాయిన్ అయ్యాడని తెలిపారు. అతడు భూ కబ్జలు చేసినట్టు రూడి అయ్యిందన్నారు. తెలంగాణలో యాసంగిలో వేసిన వడ్లను కొనుగోలు చేస్తామని హామీ పత్రాన్ని సాయంత్రం 5 గంటల లోపు తీసుకురండన్నారు. మీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది కదా... మీకు దమ్ముంటే తీసుకు రండి లేకపోతే బేషరతుగా రాజీనామా చేయండన్నారు. కేంద్రం కొనుగోలు చేస్తామని హామీ ఇస్తే నేను రాజీనామా చేస్తాను అన్నారు. లేకపోతే బీజేపీ ఎంపీ బండి సంజయ్, కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ దేశానికి పట్టిన దుర్గతని..  ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్ముతుందన్నారు. తెలంగాణ లో ఉన్న 60 లక్షల  రైతులకు బీజేపీ అన్యాయం చేస్తుందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు అవసరం లేదని.. ప్రతిగింజను కొంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.