- డీజిల్ బాటిల్‌తో బీజేపీ నేత హల్చల్
- సిరికొండలో బీఆర్ఎస్ నేతల ధర్నా
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాల్లో యాసంగి వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై రైతులు మండిపడుతున్నారు. శుక్రవారం ఇందల్వాయి–ధర్పల్లి మెయిన్ రోడ్‌పై ఎల్లారెడ్డిపల్లి రైతులు ధర్నా చేపట్టారు. పది రోజుల నుంచి కాంటా కోసం వడ్ల బస్తాలతో ఎండలో ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై వంటావార్పునకు రెడీ అయ్యారు. ఇంతలో అక్కడికి డీజిల్ బాటిల్‌తో వచ్చిన ఎల్లారెడ్డిపల్లి సర్పంచ్మఠంల సుజాత భర్త, బీజేపీ నేత మఠంల శేఖర్ హల్చల్ చేశారు. డీజిల్ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేయగా పోలీసులు వారించి పక్కకు తీసుకెళ్లారు. రైతులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు.
తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నేతలు
వడ్ల కొనుగోళ్లలో జాప్యానికి నిరసనగా సిరికొండలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. దొడ్డు రకం వడ్లు అన్లోడ్ చేసుకోడానికి జిల్లాలోని మిల్లర్లు ఒప్పుకోకపోవడంతో కొనుగోలు సెంటర్లలో కొనడంలేదు. వడ్లను వెంటనే కొని రైతుల ఇబ్బందులను తీర్చాలని బీఆర్ఎస్ నేతలు కిషన్, గడ్గోల్ భూమారెడ్డి నేతృత్వంలో ధర్నా చేశారు.
