కార్మికుల సేఫ్టీని పట్టించుకుంటలే

కార్మికుల సేఫ్టీని పట్టించుకుంటలే
  • సింగరేణి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌పై ఎమ్మెల్యే ఈటల ఫైర్
  • గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పరామర్శ 
  • రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

మంచిర్యాల/నస్పూర్/మందమర్రి, వెలుగు: బొగ్గు గని కార్మికుల సేఫ్టీని సింగరేణి మేనేజ్ మెంట్ పట్టించుకోవడం లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. మేనేజ్ మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. బొగ్గు ఉత్పత్తే టార్గెట్‌‌‌‌గా కార్మికులను బలవంతంగా డ్యూటీలకు పంపుతోందని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి మంచిర్యాల జిల్లాలో ఈటల బుధవారం పర్యటించారు. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియా ఎస్సార్పీ 3 గనిలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలను పరామర్శించారు. ‘‘ఎస్సార్పీ 3 గనిలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రెడ్ జోన్‌‌‌‌గా డిక్లేర్ చేశారు. అయినప్పటికీ సింగరేణి మేనేజ్ మెంట్ బొగ్గు ఉత్పత్తి కోసం కార్మికులను బలవంతంగా డ్యూటీకి పంపించి, నలుగురు కార్మికుల మృతికి కారణమైంది” అని ఈటల ఆరోపించారు. కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం కోసం తోటి కార్మికులు ఆందోళన చేస్తే, లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. 
సీఎంకు పరామర్శించే టైమ్ లేదా?  
‘‘సింగరేణి కార్మికులకు అండగా ఉంటాను. ఎలాంటి అన్యాయం జరిగినా నేను ఉన్నాను” అంటూ గతంలో చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదని ఈటల ప్రశ్నించారు. గతంలో బొగ్గు గనుల్లో కార్మికులు చనిపోతే, అప్పటి ముఖ్యమంత్రులు మృతుల కుటుంబాలను పరామర్శించారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ కు ఆ టైమ్ కూడా లేదా? అని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాద బాధితులనూ కేసీఆర్ ఇప్పటి వరకు పరామర్శించలేదని మండిపడ్డారు. ఈటల వెంట బీఎంఎస్ స్టేట్​ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య తదితరులు ఉన్నారు. 
కేసీఆర్.. పాలన చేతకాకుంటే రాజీనామా చెయ్ 
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఈటల మాట్లాడారు. సీఎం కేసీఆర్​కు పాలన చేతకాకుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో చివరి గింజ వరకూ కొంటున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని ఇన్ని రోజులు చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కేంద్రం వడ్లు కొనడం లేదంటూ ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘కేసీఆర్​అధికారంలోకి రాగానే ధర్నా చౌక్​ను ఎత్తేసి ప్రజలకు ఉద్యమాలు చేసే హక్కు లేకుండా చేశారు. ఇప్పుడేమో అదే ధర్నా చౌక్​లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నా చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది” అని విమర్శించారు. రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఖర్చు పెట్టి రైస్​మిల్లులను ఆధునికీకరిస్తే బాయిల్డ్​ రైస్​ సమస్యే ఉండదని.. కానీ కేసీఆర్​ఆ పని చేయకుండా కేంద్రం మీద నిందలు మోపుతున్నారని ఈటల మండిపడ్డారు.
కేసీఆర్​కు గుణపాఠం చెప్పిన్రు: వివేక్ 
హుజూరాబాద్​ఉప ఎన్నికలో ప్రజలు ఈటల రాజేందర్​ను గెలిపించి సీఎం కేసీఆర్​కు తగిన గుణపాఠం చెప్పారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్​వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ రూ.600 కోట్ల అవినీతి డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఏ కష్టం వచ్చినా సొంత మనిషిలా ఆదుకుంటున్న ఈటలను.. అక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని అన్నారు. హుజూరాబాద్​లో బీజేపీ గెలుపుతో సీఎం కేసీఆర్ కు నిద్రపట్టడం లేదని రఘునాథ్​రావు అన్నారు. ఫ్రస్ట్రేషన్​లో ‘‘వెంటాడుతా, వేటాడుతా, ఆరుముక్కలు చేస్తా’’ అంటూ సీఎం స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నారని విమర్శించారు.