ఆధార్ కార్డులో త్వరలో ఒక కొత్త మార్పు రాబోతుంది. భద్రతను పెంచడం, మోసాలను అరికట్టడం కోసం UIDAI (భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ) ఆధార్ కార్డును కొత్త రూపంలో తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం మన ఆధార్ కార్డుపై పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ ఇంకా 12 అంకెల ఆధార్ నంబర్ స్పష్టంగా కనిపిస్తాయి. అయితే కొత్త డిజైన్‌లో ఇవేవీ ఉండకపోవచ్చు. కార్డు ముందు భాగంలో కేవలం మీ ఫోటో, ఒక సెక్యూరిటీ QR కోడ్ మాత్రమే ఉండే అవకాశం ఉంది.
అంటే మీ పేరు, అడ్రస్ వంటి వ్యక్తిగత వివరాలు కార్డుపై ముద్రించరు. అవి QR కోడ్ రూపంలో ఉంటాయి. మనం ఎక్కడైనా ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినప్పుడు లేదా ఎవరికైనా చూపించినప్పుడు మన వివరాలు ఇతరులకు ఈజీగా తెలిసిపోతుంటాయి. దీనివల్ల ఇతరుల ఆధార్ వివరాలతో సిమ్ కార్డులు తీసుకోవడం, మనకు తెలియకుండానే మన పేరుపై లోన్లు తీసుకోవడం, ఆధార్ ద్వారా జరిగే బ్యాంక్ మోసాలను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎలా పనిచేస్తుందంటే
ఎవరైనా మీ వివరాలను వీరిఫై చేయాలంటే ఉదాహరణకు హోటల్ చెక్-ఇన్ లేదా ఆఫీస్ ఎంట్రీ దగ్గర ప్రత్యేకమైన మొబైల్ యాప్‌తో మీ ఆధార్ కార్డు QR కోడ్‌ను స్కాన్ చేయాలి. అప్పుడు మాత్రమే వారికి అవసరమైన వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల మీ అనుమతి లేకుండా మీ సమాచారం ఎవరికీ తెలియదు.
కొత్త ఆధార్ యాప్:
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొత్త ఆధార్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫేస్ అథెంటికేషన్ తో వెరిఫై చేసుకోవచ్చు. మీ ఫింగర్ ప్రింట్/ బయోమెట్రిక్ ఒక్క క్లిక్‌తో లాక్ లేదా అన్‌లాక్ చేయవచ్చు. ఇంకా మీకు కావాల్సిన వివరాలను మాత్రమే అంటే ఉదాహరణకు కేవలం వయస్సు మాత్రమే అవతలి వారికి తెలిసేలా QR కోడ్ సృష్టించుకోవచ్చు. ఈ కొత్త డిజైన్‌పై UIDAI ఇంకా అధికారికంగా నిర్ణయం ప్రకటించలేదు. ఒకవేళ కొత్త కార్డులు వచ్చినా, పాత కార్డులు చెల్లుతాయని, కొత్తగా రిజిస్టర్ చేసుకునే వారికి లేదా అప్‌డేట్ చేసుకునే వారికి కొత్త ఫార్మాట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
