లఖీంపూర్ కేసులో దర్యాప్తుపై పర్యవేక్షణ

లఖీంపూర్ కేసులో దర్యాప్తుపై పర్యవేక్షణ
  • పర్యవేక్షణాధికారిగా జస్టిస్ జైన్​ను నియమించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: నలుగురు రైతులతో పాటు ఎనిమిది మందిని పొట్టన పెట్టుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై విచారణ కీలక మలుపు తిరిగింది. సిట్ దర్యాప్తుపై పర్యవేక్షణకు పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రాకేశ్ కుమార్ జైన్​ను సుప్రీంకోర్టు బుధవారం నియమించింది. ‘‘యూపీ సర్కారు వేసిన సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేసేలా ఆయన చూస్తారు. ఏ రోజుకారోజు పర్యవేక్షిస్తారు. ఆయన చార్జిషీట్, స్టేటస్ రిపోర్టు సమర్పించిన తర్వాత మళ్లీ విచారిస్తాం” అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.

యూపీ సర్కారు ఇచ్చిన ఐపీఎస్​ల లిస్టు నుంచి ఐజీ పద్మజా చౌహాన్​తో పాటు మరో ఇద్దరు ఆఫీసర్లను సిట్​లో భాగస్వాములను చేసింది. సిట్ దర్యాప్తుపై, పర్యవేక్షణకు వేసిన జ్యుడీషియల్ కమిషన్​పై తమకు నమ్మకం లేదని గతంలో కోర్టు చెప్పడం తెలిసిందే. దాంతో సుప్రీంకోర్టు సూచించే వారినే పర్యవేక్షణాధికారిగా నియమిస్తామని నవంబర్ 15న యూపీ సర్కారు కోర్టులో అంగీకరించింది.