పరిగి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని మీర్జాపూర్ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఉదయం గ్రామంలో ఉపాధి హామీ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ, పేదల సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు.
దేశంలో పింఛన్ వ్యవస్థను ప్రారంభించి సామాజిక భద్రతకు పునాది వేసిందన్నారు. సంవత్సరానికి వంద రోజుల ఉపాధి కల్పిస్తూ పేదలకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
