కాంగ్రెస్​, టీఆర్​ఎస్​లో పీకే పరేషాన్​

కాంగ్రెస్​, టీఆర్​ఎస్​లో పీకే పరేషాన్​
  • ప్రత్యర్థులతో ఒక్కడే కలిసి పనిచేస్తే ఎట్లా ?
  • ఇది రెండు పార్టీలకు నష్టమేనంటున్న నేతలు
  • తాజాగా కేసీఆర్‌‌తో రెండు రోజుల భేటీ
  • జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చ
  • ఇప్పటికే కాంగ్రెస్‌‌లో చేరేందుకు సోనియా, రాహుల్‌‌తో ప్రశాంత్​ కిశోర్​ మంతనాలు

హైదరాబాద్‌‌, వెలుగు :  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌‌ కిశోర్‌‌ వ్యవహారం కాంగ్రెస్‌‌, టీఆర్ఎస్​లో అయోమయానికి తెరతీసింది. రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌‌లోనే ఉండి సీఎం కేసీఆర్‌‌తో ఆయన సుదీర్ఘ మంతనాలు జరపడం మరింత గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్‌‌ పార్టీలో చేరేందుకు పీకే ఇప్పటికే ఆ పార్టీ చీఫ్‌‌ సోనియాగాంధీ, ముఖ్య నేత రాహుల్‌‌ గాంధీతో పలుమార్లు భేటీ అయ్యారు. త్వరలోనే కాంగ్రెస్‌‌లోకి ఎంట్రీ ఇస్తారనే చర్చ సాగుతుండగా.. ఉన్నట్టుండి హైదరాబాద్‌‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రగతి భవన్‌‌లో కేసీఆర్‌‌తో చర్చించారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై వారు చర్చించినట్టు ప్రగతి భవన్‌‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవైపు కాంగ్రెస్‌‌లో చేరేందుకు ప్రయత్నిస్తూనే తెలంగాణలో ఆ పార్టీకి రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీఆర్‌‌ఎస్‌‌తో పీకే కలిసి పనిచేయడం రెండు పార్టీల్లోని నేతలను హైరానాలో పడేసింది. దీని వల్ల జనంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని, రెండు పార్టీలకు నష్టమేనని నేతలు అంటున్నారు. 

రెండురోజులు కేసీఆర్​తో చర్చల మీద చర్చలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే టార్గెట్​గా అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్‌.. ప్రజానాడి తెలుసుకోవడానికి పీకేను ఎలక్షన్‌ స్ట్రాటజిస్ట్‌గా అపాయింట్‌ చేసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన పీకే.. రాజకీయ పరిస్థితులు, టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వంపై ప్రజాస్పందన ఎలా ఉందనే రిపోర్టు కేసీఆర్‌కు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పీకే టీం చేసిన సర్వే రిపోర్టుపై శని, ఆదివారం జరిగిన రెండు రోజుల సమావేశంలో ఇద్దరి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటు, ఇందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎంతమేరకు అవసరమనే అంశంపైనా చర్చించినట్టుగా సమాచారం. ఏయే రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, ఏం చేస్తే బీజేపీని గద్దె దించవచ్చు.. అనే కోణంలోనూ చర్చ జరిగినట్టు ప్రగతి భవన్‌ వర్గాలు చెప్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేసీఆర్‌, పీకే మధ్య చర్చలు ముగిశాయి. అంతకుముందు ఇద్దరు కలిసి లంచ్‌ చేశారు. కేసీఆర్‌తో పాటే ప్రశాంత్‌ కిశోర్‌ ఎర్రవల్లిలోని సీఎం ఫాం హౌస్‌కు వెళ్లారు. రాత్రి మరోసారి కేసీఆర్‌తో చర్చించిన అనంతరం సోమవారం తెల్లవారుజామున ఆయన ఢిల్లీ వెళ్లిపోతారని తెలిసింది. 

ఐప్యాక్​తో పీకే అనుబంధం తెగినట్టేనా ?

ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సోనియా, రాహుల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే వార్తలు వచ్చిన టైంలోనే ఆయన టీఆర్‌ఎస్‌ అధినేతతో భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్‌లో చేరినా తన టీం (ఐప్యాక్‌) టీఆర్‌ఎస్‌కు పనిచేస్తుందని ఆయన చెప్పినట్టుగా ప్రగతి భవన్‌ వర్గాలు వెల్లడించాయి. ఐప్యాక్‌ టీం తమ పార్టీ కోసం పనిచేస్తుందని, ఐప్యాక్‌తో పీకే తన అనుబంధాన్ని తెంచుకున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదివారం నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్ఫర్మ్‌ చేశారు.  మరో టీవీ ఇంటర్వ్యూలో దీనికి భిన్నంగా..  పీకేను మించిన వ్యూహకర్త కేసీఆర్‌ అని అన్నారు. ఐప్యాక్‌ నుంచి పీకే నిష్క్రమించినట్టుగా చెప్తున్నా దానితో ఆయన అనుబంధం తెంచుకోవడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్‌లో చేరడానికే ఆయన ఐప్యాక్‌ నుంచి బయటికి వచ్చినట్టు చెప్పుకుంటున్నారని తెలుస్తున్నది. ఇది కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలను మరింత హైరానాకు గురి చేస్తున్నది. 

కాంగ్రెస్​తో ఉంటూ టీఆర్​ఎస్​తో పనిచేస్తే కష్టమే !

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ రాజకీయ ప్రత్యర్థిగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.4 శాతం ఓట్లతో 19 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్‌లో పీకే చేరితే ఆయనకు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ పదవి ఇస్తారని, ఆయన రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు పార్టీ విజయానికి దోహదం చేస్తాయని రాష్ట్ర నేతలు కూడా లెక్కలు వేసుకున్నారు. ఇతర పార్టీలతో పొలిటికల్‌ అసైన్‌మెంట్లు వదులుకొని వస్తేనే కాంగ్రెస్‌లో చేర్చుకుంటామని ఆయన చేరికపై ఏర్పాటు చేసిన కమిటీ కూడా తేల్చిచెప్పింది. అయినా పీకే టీఆర్‌ఎస్‌ చీఫ్‌తో భేటీ కావడం, టీఆర్‌ఎస్‌తో ఐప్యాక్‌ పొలిటికల్‌ అసైన్‌మెంట్‌ కంటిన్యూ చేస్తుందని పేర్కొనడం జాతీయ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్‌ పొలిటికల్‌ స్పీచ్‌పైనా పీకే చర్చించినట్టుగా తెలుస్తున్నది. ఆయన ఐప్యాక్‌కు దూరమైనట్టు బయటికి చెప్తున్నా, బ్యాక్‌ ఎండ్‌లో ఆయన దానికి వర్క్‌ చేస్తూనే ఉంటారని అనుమానిస్తున్నారు. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలు దెబ్బ తీస్తే జాతీయ స్థాయిలోనూ నష్టం తప్పదంటున్నారు.

పీకే తాజా రిపోర్టుపైనా పరేషాన్​

టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 40 మందికిపైగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని తాజా రిపోర్టులోనూ పీకే తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. వారి స్థానంలో అక్కడ ఎవరు క్యాండిడేట్‌ అయితే బెటర్‌ అనే కోణంలోనూ సర్వే చేసి ఆ రిపోర్టు కూడా కేసీఆర్‌కు ఇచ్చినట్టు సమాచారం. పీకే ప్రతిపాదించిన ఆల్టర్నేట్‌ క్యాండిడేట్లలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వాళ్ల పేర్లు సైతం ఉన్నాయనే ప్రచారం రెండు పార్టీల నేతల్లో గందరగోళం సృష్టిస్తున్నది. ఫాం హౌస్‌లోనూ వీరిద్దరు చర్చలు జరపడంపై మరింత హైడ్రామా కొనసాగుతున్నది. కేసీఆర్‌ను జాతీయ నేతగా ప్రొజెక్ట్‌ చేసే పీకే.. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ఏమేరకు దోహదపడుతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పీకేపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌‌

-పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ జగ్గారెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌‌ కిశోర్‌‌ విషయంలో కాంగ్రెస్‌‌ అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌‌ అని పీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌‌ను పీకే కలిసిన విషయం తమ పరిధిలోనిది కాదన్నారు. టీఆర్‌‌ఎస్‌‌కు వ్యూహకర్తగా ఉంటూ కాంగ్రెస్‌‌లో ఆయన చేరుతారనే దానిపై అనుమానాలు రావడం సహజమన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌‌ గాంధీ.. దేశ ప్రజల మేలు కోసమే ఏ పని అయినా చేస్తారన్నారు. పీకే విషయంలో కాంగ్రెస్‌‌ పార్టీలో ఎలాంటి కన్ఫ్యూజన్‌‌ లేదన్నారు. పాలనలో, లా అండ్‌‌ ఆర్డర్‌‌ విషయంలో కేసీఆర్‌‌ ఫెయిల్‌‌ అయ్యారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల పక్షాన తాము కొట్లాడుతున్నామని చెప్పారు. ప్రజల అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని బీజేపీ చెప్పిందని, దీనిపై నిలదీస్తామని అన్నారు. బీజేపీ, టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రజల తరఫున ప్రశ్నిస్తామని అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌‌ గాంధీ సమావేశం ఉంటుందని, అన్ని విద్యార్థి సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. సోమవారం వర్సిటీకి వెళ్లి, వీసీని కలిసి అనుమతి కోరుతామన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉస్మానియా వర్సిటీదే ప్రధాన పాత్ర అని, విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోవద్దనే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని అన్నారు. స్టూడెంట్ల త్యాగాలు మరువలేనివన్నారు.