‘పీఎం ఈ-బస్ సేవ’కు వరంగల్,  నిజామాబాద్ ఎంపిక

‘పీఎం ఈ-బస్ సేవ’కు వరంగల్,  నిజామాబాద్ ఎంపిక

హైదరాబాద్, వెలుగు:  పీఎం ఈ-–బస్ సేవ స్కీం కింద  కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా 169 సిటీలు ఎంపిక చేయగా.. వీటిలో తెలంగాణ నుంచి వరంగల్, నిజామాబాద్ నగరాలకు చోటు దక్కింది. చిన్న, మధ్య తరహా సిటీల్లో డీజిల్ బస్సులను తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఈ స్కీం ద్వారా దేశవ్యాప్తంగా  10 వేల ఎలక్ట్రిక్ బస్సులను పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌‌‌‌షిప్ ( పీపీపీ ) భాగస్వామ్యంలో తిప్పాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా వరంగల్​కు100, నిజామాబాద్​కు 51 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం చార్జింగ్​స్టేషన్లు, ఇతరత్రా ఏర్పాట్లు పూర్తి చేస్తే బస్సులను పంపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని  కేంద్ర అర్బన్ అండ్ హౌసింగ్ శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు సోమవారం పార్లమెంట్​లో వెల్లడించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌‌లో నడుస్తున్న ఈ–-బస్సులతో సంబంధం లేకుండా పీఎం ఈ–బస్‌‌ సేవ స్కీం ద్వారా మాత్రమే వరంగల్, నిజామాబాద్ సిటీలకు ఈ–బస్సులు రానున్నాయి.వరంగల్, హన్మకొండ నగరాల్లో ఒక్కో చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు పనులు సాగుతున్నాయి. ఒక్కో స్టేషన్‌‌లో ఒకేసారి నాలుగు బస్సులకు చార్జింగ్ చేసేలా వసతులు కల్పిస్తున్నారు. అయితే, వీటికి తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్కో) నుంచి అనుమతి రావాల్సి ఉంది. వచ్చాక పనులు వేగవంతం అవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్​లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం భూ సేకరణ సాగుతోంది.  పనులు పూర్తయితే వరంగల్, నిజామాబాద్ రోడ్లపై  ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి.