- ఆ పార్టీ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ: ప్రధాని మోదీ
- త్వరలోనే ఓటముల్లో సెంచరీ కొట్టబోతున్నరని వెల్లడి
- ఓటమి నిరాశలో బట్టలు చింపుకుంటున్నారని ఎద్దేవా
- అస్సాంలో సిల్చర్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం
గువాహటి: పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ మన దేశ ప్రజల్లోనూ భయాందోళనలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. ఇలాంటి కీలక సమయంలో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా వ్యవహరించడంలో కాంగ్రెస్ మరోసారి విఫలమైందని మండిపడ్డారు. శనివారం ఆయన అస్సాంలోని సిల్చర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.."పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం మన దేశ పౌరులపై పడకుండా ఎన్డీయే సర్కార్ నిరంతరం కృషి చేస్తున్నది. మేం ప్రజలను కాపాడేందుకు ఓ వైపు అహర్నిశలు శ్రమిస్తుంటే.. ఇలాంటి కీలక సమయంలో బాధ్యతాయుతమైన రాజకీయ పక్షంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశంలో భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. దేశం కష్టాల్లో చిక్కుకుందనే భయాలు సృష్టించి..నన్ను వేధించాలని చూస్తున్నారు.
కాంగ్రెస్ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుందని భావించాం. కానీ, జాతీయ ప్రయోజనాల విషయంలో అది మరోసారి విఫలమైంది. మన దేశ అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేని విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ ఒక కీలుబొమ్మలా మారిపోయింది. అస్సాం ప్రజలు కాంగ్రెస్‌ను ఇక్కడి నుంచి ఎప్పుడో తరిమికొట్టారు. రానున్న ఎన్నికల్లోనూ ప్రతి రాష్ట్రం ఆ పార్టీకి గుణపాఠం చెప్పనుంది. కాంగ్రెస్ త్వరలోనే ఓటముల్లో సెంచరీ కొట్టబోతోంది" అని విమర్శించారు. ఢీల్లీలో ఇటీవల జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్ లో యూత్ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలపడాన్ని దేశం మొత్తం ఖండించిందని మోదీ వెల్లడించారు. ఓటమితో నిరాశ చెందిన కాంగ్రెస్.. చివరకు దేశ ప్రతిష్టను మసకబార్చడమే పనిగా పెట్టుకున్నదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు తమ తమ సొంత బట్టలు తామే చింపుకోవడం తప్ప.. వాళ్లకి మరేమీ మిగల్లేదని మోదీ ఎద్దేవా చేశారు.
23,550 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా సిల్చర్‌లో సుమారు రూ. 23,550 కోట్ల విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వీటిలో రూ. 22,864 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 166 కిలోమీటర్ల సిల్చర్~షిల్లాంగ్ యాక్సెస్-కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే అత్యంత ప్రధానమైనది. ఇది గౌహతి, సిల్చర్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనుంది. వీటితో పాటు సిల్చర్‌లోని ఎన్ హెచ్-306 పై రూ. 565 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు, అలాగే.. కరీంగంజ్ జిల్లాలోని పథర్‌కండి వద్ద రూ. 122 కోట్లతో ఏర్పాటు చేయనున్న అగ్రికల్చర్ కాలేజీకి మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ కలిపి బరాక్ వ్యాలీ ప్రాంతంలో రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. విద్యా, ఆర్థిక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని ప్రధాని పేర్కొన్నారు.
