ఫేక్​ పోస్టులతో  విష ప్రచారం

ఫేక్​ పోస్టులతో  విష ప్రచారం
  • హుజూరాబాద్​ సెంట్రిక్​గా సోషల్​ మీడియాలో తప్పుడు రాతలు
  • మార్ఫింగ్​ ఫొటోలు, ఫేక్​ వీడియోలు వైరల్
  • ఎన్నికల కమిషన్​నూ కించపరిచేలా పోస్టులు
  • ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటున్న ప్రతిపక్షాలు

హైదరాబాద్​, వెలుగు: హుజూరాబాద్​ బై ఎలక్షన్​లో ఫేక్​ న్యూస్​ ప్రచారంఅగ్గి రాజేస్తోంది. సోషల్​ మీడియాలో పూటకో తప్పుడు​ పోస్టు వైరల్​ అవుతోంది. ఒక్కో ఫేక్​ పోస్టు మూడు నాలుగు రోజులు రాష్ట్రమంతటా గిరికీలు కొడుతోంది. దీనికి వివరణలు.. కౌంటర్లు.. ఇచ్చుకునేందుకు లీడర్లు సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగుతున్నారు. ఫేక్​ న్యూస్​ వైరల్​ అవడంతో  అసలు నిజమేమిటో తెలియక జనం గందరగోళానికి గురవుతున్నారు.
హద్దులు మీరుతున్న టీమ్​లు
ఎన్నికల ప్రచార సరళిలో సోషల్​ మీడియా కీలకంగా మారడంతో పొలిటికల్​ పార్టీలు భారీగా సోషల్​ మీడియా టీమ్​లను ఏర్పాటు చేసుకున్నాయి. తమ పార్టీని గెలిపించేందుకు ఎంతైనా బరితెగిస్తామన్నట్లు కొన్ని టీమ్​లు హద్దులు మీరుతున్నాయి. ఫేక్​ న్యూస్​ను, మార్ఫింగ్​ ఫొటోలను వైరల్​ చేయడంపైనే ఫోకస్​ చేస్తున్నాయి. ప్రత్యర్థిపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంటున్నాయి. అధికార పార్టీ ఏకంగా హుజూరాబాద్​లో ఫంక్షన్​ హాళ్లను రెంట్​కు తీసుకొని, వందల మంది సోషల్​ మీడియా టీమ్​ సభ్యులకు మకాం ఏర్పాటు చేసింది. ‘ఉచిత భోజన వసతి కల్పిస్తాం..’ అంటూ యూట్యూబ్​, డిజిటల్​ మీడియా టీమ్​లకు హుజూరాబాద్​ లీడర్లు ఓపెన్​గా ఆహ్వానం పలుకుతున్న తీరు వాట్సాప్​ గ్రూపుల్లో చర్చనీయాంశంగా మారింది. 

దళిత బంధుపై..
ఈటల లేఖ వల్లే దళితబంధు ఆగిందంటూ టీఆర్‌ఎస్‌  విష ప్రచారం చేసింది. దళిత బంధు ఆపడానికి ఈటల కారణమని ఎంపీ అర్వింద్‌ చెప్పినట్లు మరో ఫేక్​ వీడియో వైరలైంది. తమను బద్నాం చేసే కుట్రలను అడ్డుకో వాలని బీజేపీ డిమాండ్​ చేస్తోంది. 

బల్మూరి బాధలో ఉన్నట్లు
హుజూరాబాద్​ కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్​పై ఒక ఫేక్ న్యూస్​ క్లిప్​ వైరల్​ అవుతోంది. ఈటల,  రేవంత్‌ రెడ్డి కుమ్మక్కయ్యారని, తనను బలి పశువును చేశారంటూ బల్మూరి వెంకట్‌ ఆవేదనలో ఉన్నట్లు ఒక తప్పుడు క్లిప్పింగ్​ను టీఆర్​ఎస్ గ్రూపులు వైరల్​ చేశాయి.