మావోయిజాన్ని ఎవరూ ఓడించలేరు :మావోయిస్టు పార్టీ మాజీ నేత బండి ప్రకాశ్‌‌

మావోయిజాన్ని ఎవరూ ఓడించలేరు :మావోయిస్టు పార్టీ మాజీ నేత బండి ప్రకాశ్‌‌
  • నష్టపోయిన పార్టీ కొత్త రూపంలో ప్రజల కోసం పనిచేస్తది

కోల్​బెల్ట్, వెలుగు : సమాజంలో అసమానతలు, అణచివేతలు ఉన్నంతకాలం మావోయిజం, మార్క్సిజం, లెనినిజం బతికే ఉంటాయని మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత బండి ప్రకాశ్‌‌ అలియాస్‌‌ ప్రభాత్‌‌ చెప్పారు. మందమర్రికి చెందిన బండి ప్రకాశ్‌‌ హేమ, గోదావరిఖనికి చెందిన అబ్బాసి నారాయణ-లక్ష్మి దంపతులకు మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి ప్రకాశ్‌‌ మాట్లాడుతూ... మావోయిస్టు సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరితరం కాదన్నారు.

దేశంలో కొందరు వ్యక్తులను చంపి మావోయిజం అంతమైందని కొందరు ఆత్మసంతృప్తి చెందుతున్నారన్నారు. ఇటీవలి కాలంలో మావోయిస్ట్‌‌  పార్టీ చాలా నష్టపోయిందని, అయినప్పటికీ ప్రజల కోసం కొత్త రూపంలో మళ్లీ పనిచేస్తుందని ప్రకటించారు. అనారోగ్య కారణాలతో సాయుధ పోరాటాన్ని వీడామని, చివరి వరకు ప్రజల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌‌ నేత, మాజీ విప్‌‌ నల్లాల ఓదెలు, మాజీమంత్రి బోడ జనార్దన్‌‌, మినీమం వేజ్‌‌ బోర్డు చైర్మన్‌‌ జనక్‌‌ ప్రసాద్‌‌, విద్యావంతుల వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గురిజాల రవీందర్‌‌రావు, యువజన, సాంస్కృతిక శాఖ సలహాదారు అంతడుపుల నాగరాజు పాల్గొన్నారు.