ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకున్నాం.... ఈ కారణంతోనే కాంగ్రెస్లో చేరుతున్నాం..

ప్రాంతీయ పార్టీ పెట్టాలనుకున్నాం.... ఈ కారణంతోనే కాంగ్రెస్లో  చేరుతున్నాం..

మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరిక ఖరారైంది. జులై 2వ తేదీన ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  తెలంగాణ వస్తే ప్రజల బతుకులు మారతాయనుకున్నామని..కానీ కేసీఆర్ పాలనలో ప్రజల బతుకులు ఆగమయ్యాయని  ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పదవులు ముఖ్యం కాదని..ప్రజల ఆత్మాభిమానం కూడా ముఖ్యమన్నారు. ః

సర్వే చేయించాం..

బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక సర్వే చేయించామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సర్వేల్లో కేసీఆర్ కు 80 శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారని తేలిందన్నారు. జనం  ఏం కోరుకుంటున్నారో .. ..ఏ పార్టీకి వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నారో తెలుసుకున్నామన్నారు. ఓ  దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశామన్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలన్న  ప్రతిపాదన వచ్చిందన్నారు. దీంతో ప్రాంతీయ పార్టీ పెట్టాలనే ఆలోచనను విరమించుకున్నామన్నారు. 

సభలు..సమావేశాలు నిర్వహించాం..

ఏ పార్టీలో చేరాలన్న అంశంపై మాజీ మంత్రి  జూపల్లితో కలిసి తాను అనేక సభలు , సమావేశాలు నిర్వహించానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎన్నో సర్వేలు , అనేమంది  ప్రముఖులతో మాట్లాడామన్నారు. ఆ  తర్వాతే రిజల్ట్‌ను సింగిల్ పేపర్‌పై పెట్టామన్నారు.

అనేక పార్టీలు ఆహ్వానించాయి..

తనతో పాటు జూపల్లిని వివిధ పార్టీలు సంప్రదించాయని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పలు ప్రాంతీయ పార్టీలు చేరాలని కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్ తో పాటు..బీజేపీ నేతలు కూడా తనను, జూపల్లిని కలిసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు. కర్నాటక విజయం తర్వాత అది మరింత పెరిగిందన్నారు. అటు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. ఈ క్రమంలో  రాహుల్ గాంధీ, ఖర్గేను కలిశాక నిర్ణయం తీసుకుందామని జూపల్లికి చెప్పానని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీని కలిశాక తమకు క్లారిటీ వచ్చిందని..అందుకే తాను జూపల్లి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలిపారు. అందరూ కలిసి తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అటు  కేంద్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.