V6 News

రోడ్డు ప్రమాదాల  నివారణకే ‘అరైవ్–అలైవ్’ : మంత్రి పొన్నం

రోడ్డు ప్రమాదాల  నివారణకే ‘అరైవ్–అలైవ్’ : మంత్రి పొన్నం
  • అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తాం : మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఈ నెల 13 నుంచి 18 వరకు అరైవ్–అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ 6 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రవాణా శాఖ తరఫున సమీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణ, ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు.

ఆర్టీసీలో 30 ఏండ్లుగా పని చేస్తూ ఒక్క యాక్సిడెంట్​కూడా చేయని డ్రైవర్లను సన్మానిస్తామని తెలిపారు. రోడ్​సేఫ్టీ మీటింగ్స్​ప్రతి జిల్లాలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ తో కలిసి అరైవ్–అలైవ్ ప్రోగ్రామ్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్​చేశారు. 

పోచారం కాల్​ చేయలేదు..

మంత్రులెవరూ తన ఫోన్లకు స్పందించడం లేదంటూ ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన ఆరోపణలపై పొన్నం స్పందించారు. పోచారం తనకు కాల్ చేయలేదని, ఆయన నుంచి ఫోన్​ వస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతానన్నారు. ఇతర మంత్రులు ఏవైనా ముఖ్యమైన సమావేశాల్లో ఉన్నప్పుడు ఆయన కాల్ చేస్తే స్పందించకపోయి ఉండవచ్చని చెప్పారు.