కూరగాయలతో లాభాల పంట

కూరగాయలతో లాభాల పంట

 ఈ రోజుల్లో వ్యవసాయం అంటేనే పెనుభారం అనుకుంటారు చాలామంది. సరిగ్గా చేయాలే కానీ వ్యవసాయం చేసి మంచి దిగుబడులు తెచ్చుకోవచ్చు. లాభాల పంట పండించొచ్చు అంటున్నారు ఈ యంగ్​ ఫార్మర్స్​. తమ సక్సెస్​ ఫార్ములా ఏంటో చెబుతూ వాళ్ల  జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చారు. జాగిరపు శ్రీనివాస్​రెడ్డి, నర్సింహారెడ్డిలది కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం కురిక్యాల. 20 ఎకరాల్లో కూరగాయల తోటలు వేశారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ, యాజమాన్య పద్ధతులు పాటిస్తూ లాభాలు తెచ్చుకుంటున్నారు. అందరు రైతుల్లా వరి, పత్తి, మక్క పంటలు వేయకుండా కేవలం కూరగాయల పంటలతోనే లాభాలు గడిస్తున్నారు. అధిక ఫలసాయం రావాలంటే రసాయన ఎరువులు, పురుగుమందులు వాడాల్సిన అవసరం లేదు. సేంద్రియ ఎరువులు వాడుతూ అధిక దిగుబడులు సాధించొచ్చు. అదికూడా తక్కువ ఖర్చుతో అని చెబుతున్నారు ఈ ఇద్దరు. 
20 ఎకరాల్లో సాగు
‘‘మా అన్నదమ్ములిద్దరికీ కలిపి12 ఎకరాల భూమి ఉంది. మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఈ ప్రాంతంలో పండే వరి, పత్తి, మక్క పంటలు కాకుండా కూరగాయలు పండించాలి అనుకున్నాం. అనుకున్న వెంటనే టొమాటో, కాకర, బీర, పుచ్చకాయల పంటలు వేశాం. వీటికోసం ప్రత్యేకంగా మల్చింగ్ విధానం, పందిళ్లు ఏర్పాటు చేశాం. యూట్యూబ్​లో చూసి టొమాటో, కాకరకాయ, బీరకాయ, అంతర పంటగా కర్బూజ వేశాం. 12 ఎకరాల్లో టొమాటో, మిగతా 8 ఎకరాల్లో కాకరకాయ,  బీరకాయలు పండిస్తున్నాం. ఇందుకు సుమారు15 లక్షల వరకు ఖర్చు అయ్యింది. రోజుకు 40 క్వింటాళ్ల టొమాటోలు, రెండున్నర క్వింటాళ్ల కాకరకాయలు, క్వింటాల్​ బీరకాయలు వస్తాయి. వాటిని కూలీలతో తెంపించి, కరీంనగర్ రైతుబజార్​కు పంపిస్తున్నాం. టొమాటో కిలో ఆరు రూపాయలు, కాకర, బీరకాయలు కిలో రూ 20 చొప్పున ధర పలుకుతోంది. కరోనా కారణంగా కూరగాయల ధర, డిమాండ్ తగ్గింది. ఖర్చులన్నీ పోను లాభాలు బాగానే వస్తున్నాయి’. అని చెబుతున్నారు.                                                                                                                                                                        ::: బొల్లబత్తిని శ్రీనివాస్​, గంగాధర, కరీంనగర్​