పోలీస్ యూనిఫాం లో సెక్యూరిటీ కళ్లు గప్పి తెలంగాణ సచివాలయంలో రీల్స్ చేసి అందరినీ గందరగోళపర్చిన సుడో పోలీస్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు ఏపీలోని ఒంగోలుకు చెందిన రవి అలియాస్ నిఖిల్ యాదవ్ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు. కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీతో హైదరాబాద్ కు వచ్చిన రవి.. సచివాలయంలో సెక్యూరిటీగా డ్యూటీ చేస్తున్నాను..సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు ఫోన్ చేయండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. నెట్టింట వీడియో వైరల్ కావడంతో పెద్ద దుమారం రేగింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను సచివాలయంలో సెక్యూరిటీ కాదని .. ఓ సాధారణ వ్యక్తి అని.. కేవలం రీల్స్ చేసి వైరల్ అవడం కోసం ఇలా చేశాడని పోలీసులు గుర్తించారు. ఆ రీల్స్ చేసింది ఒంగోలు రవి అలియాస్ నిఖిల్ యాదవ్ గా గుర్తించారు. ఫ్యామిలీ తో కలిసి సచివాలయంలో ఫొటోలు దిగుతామని సెక్యూరిటీని బతిమలాడి లోనికి వెళ్లినట్లు గుర్తించారు. తర్వాత సచివాలయం ప్రాంగణంలో రీల్స్ చేసి సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు రవి.
రవి చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు షాక్ తిన్నారు. రవికోసం ఆరా తీసిన పోలీసులు అతని అడ్రసు, వివరాలు సేకరించారు. చివరికి అతన్ని పట్టుకున్నారు. అప్పటికే రవిపై చీటింగ్ కేసుతోపాటు ఐటీ ఆక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. బుధవారం (ఏప్రిల్ 29, 2026) రవి అలియాస్ నిఖిల్ యాదవ్ ను అరెస్ట్ చేశారు.

