గోదావరిఖని, వెలుగు: రామగుండం నవ నిర్మాణంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని, దీనిద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. అమృత్ స్కీమ్2.0 నిధులు రూ.2.53 కోట్లతో కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ మల్లపురాణికుంట, రూ 1.81 కోట్లతో మల్కాపూర్ బామండ్లకుంట చెరువుల పునరుజ్జీవన పనులను మేయర్ మహంకాళి స్వామితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పునరుజ్జీవన పనుల్లో భాగంగా చెరువుల సుందరీకరణతో పాటు స్థానికులకు ఆహ్లాదాన్ని అందించేందుకు, ఈ చెరువుల వద్ద గార్డెన్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మల్కాపూర్, ప్రశాంత్ నగర్‌లోని వరద ముప్పు లేకుండా కాల్వల నిర్మాణంతో పాటు పూడికతీత పనులు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు వడ్లూరి రవి, వెంగళ బాపు, చిదురాల నాగరాజు, కొలని కవిత, సతీశ్, పబ్లిక్ హెల్త్ డీఈ నర్సింహ స్వామి పాల్గొన్నారు.

