రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ఈ ప్రణాళికలో పారిశుధ్యం, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, మహిళా సంక్షేమం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు ఎక్కడా ఫైళ్లు పెండింగ్లో ఉండకూడదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసి ఉగాది నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ఈ ప్రణాళిక అమలులో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
