పాల్వంచ గుడిపాడుకు కొత్త శోభ

పాల్వంచ గుడిపాడుకు కొత్త శోభ
  • నేటి నుంచి ఉత్సవాలు షురూ 

పాల్వంచ, వెలుగు : మండలంలోని రామచంద్రపురంలో మోక్ష వేంకటేశ్వరుని ఆలయ పునర్నిర్మాణంతో గ్రామంలో కొత్త శోభ సంతరించుకుంది. ప్రతాపరుద్రుని హయాంలో నిర్మించిన ఆలయంలో విగ్రహాలను రజాకర్ల కాలంలో ధ్వంసం చేయగా, అప్పటినుంచి ఆలయం పడావుపడిపోయింది. పట్టణానికి చెందిన శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేశ్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. రూ.3 కోట్లతో 2022లో పాత ఆలయాన్ని తొలగించి నాలుగు ఎకరాల్లో ఆలయం, యాగశాల, గోశాల, పార్కు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. తాజాగా ఆలయ నిర్మా ణం పూర్తి కావడంతో శనివారం నుంచి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

ఈనెల 26న త్రిదండి శఠగోపముని రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ట, ఈఉపాలయాలలో విగ్రహాల ప్రతిష్టకు రంగం సిద్ధమైంది. విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. శుక్రవారం పాల్వంచ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.