రూ.120 కోట్లతో ఓయూలో అభివృద్ధి :  వర్సిటీ వీసీ ప్రొఫెసర్  రవీందర్ యాదవ్

రూ.120 కోట్లతో ఓయూలో అభివృద్ధి :  వర్సిటీ వీసీ ప్రొఫెసర్  రవీందర్ యాదవ్

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీలో దాదాపు రూ.120 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వైస్​చాన్స్​లర్​ప్రొఫెసర్​రవీందర్ యాదవ్ వెల్లడించారు. ఓయూ వీసీగా బాధ్యతలు చేపట్టి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి రవీందర్​యాదవ్ బుధవారం ప్రగతి నివేదికను ఆవిష్కరించారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టడం, అకడమిక్, పరిపాలనా వ్యవస్థలను పటిష్టం చేయటంతోపాటు విద్య, పరిశోధనా రంగాల్లో ఓయూను మేటిగా నిలపడమే ధ్యేయంగా చేపట్టిన సంస్కరణలు ఫలితాలిస్తున్నాయని  ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

మరో వందేళ్ల పాటు ఉస్మానియా తన కీర్తి, ప్రతిష్టను కొనసాగించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. రూ.120 కోట్ల వ్యయంతో  బాలుర హాస్టల్, శతాబ్ది నూతన పరిపాలనా భవనం, శతాబ్ది పైలాన్, ఓపెన్ ఎయిర్ థియేటర్ సహా అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.  కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్లు స్టీవెన్ సన్, జి.మల్లేశం, శ్రీరాం వెంకటేశ్, సి.గణేశ్, వీరయ్య,  ఆయా కాలేజీల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు పాల్గొన్నారు.