- బీఆర్ఎస్ వర్సెస్ మేఘా ఇంజినీరింగ్ కంపెనీ
గద్వాల, వెలుగు: భారత్ మాల నేషనల్ హైవే రోడ్డు పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులకు, బీఆర్ఎస్ లీడర్ల మధ్య గొడవలు జరిగి ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. భారత్మాల నేషనల్ హైవే పనుల్లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 77 కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. దీని కోసం శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తనగల గుట్ట దగ్గర క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేశారు.
ఆదివారం ఉదయం ఆఫీస్ దగ్గరకు వడ్డేపల్లికి చెందిన ఓ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధితో పాటు మరో ప్రజాప్రతినిధి భర్త తమ అనుచరులతో వచ్చి కమీషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు, మాటా మాట పెరగడంతో ఆఫీస్ పై దాడి చేసినట్లు మేఘా కంపెనీ ప్రతినిధులు సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కంపెనీ అక్రమాలను తాము ప్రశ్నిస్తే కేసులు పెడ్తున్నారని, ఇదెక్కడి న్యాయమంటూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పర్మిషన్ తీసుకోకుండా కోట్ల రూపాయల కంకర, మట్టి, రాళ్లను తీసుకెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
