దివ్యాంగులు, ట్రాన్స్‌‌‌‌జెండర్లు, వృద్ధులకు సెల్ఫ్హెల్ప్ గ్రూపులు!

దివ్యాంగులు, ట్రాన్స్‌‌‌‌జెండర్లు, వృద్ధులకు సెల్ఫ్హెల్ప్ గ్రూపులు!

 

  • వారికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి
  •  ఇంటింటికీ తిరిగి గుర్తించి చేర్చుకోండి 
  •  బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: దివ్యాంగులు, ట్రాన్స్‌‌‌‌జెండర్లు, వృద్ధుల కోసం కూడా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని బల్దియా కమిషనర్​ఆర్వీ కర్ణన్​అధికారులను ఆదేశించారు. 

శుక్రవారం సిటీలోని స్వయం సహాయక సంఘాల ప్రగతిపై జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్ల ప్రాజెక్ట్ ఆఫీసర్లతో కమిషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హత కలిగిన ప్రతి మహిళను స్వయం సహాయక సంఘాల్లో చేర్పించాలని, మహిళలను ఇంటింటికీ తిరిగి గుర్తించి చేర్చుకోవాలన్నారు. విడతల వారీగా అర్హత కలిగిన సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణ సదుపాయం కల్పించాలన్నారు. 

ఆత్మ నిర్భర్​భారత్​కోసం జీహెచ్ఎంసీపరిధిలోని మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు క్యాటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, స్ట్రీట్ వెండర్ కలెక్టివ్‌‌‌‌, ఈవెంట్ మేనేజ్‌‌‌‌మెంట్, మీ సేవా సెంటర్లు, మహిళా శక్తి కాంటీన్లు ఏర్పాటు చేయడంలో శిక్షణ ఇచ్చి ఆర్థిక సాయం చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. 

సర్కిళ్ల వారీగా ఉత్సాహంగా ఉన్న మహిళా సంఘాలను గుర్తించి వారికి ట్రైనింగ్​ఇవ్వాలన్నారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, అంటు వ్యాధుల నివారణకు మహిళా సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు ప్రతి వార్డులో నిర్వహించాలని ఆదేశించారు. 

షెల్టర్ హోమ్స్​గా కమ్యూనిటీ హాల్స్

ప్రతి సర్కిల్లో కమ్యూనిటీ హాల్‌‌‌‌ను షెల్టర్ హోమ్స్​గా మార్చి, నిరాశ్రయులను ఎన్జీవోల సహకారంతో పునరావాసం కల్పించాలని కమిషనర్ ఆదేశించారు. వారంతా తిరిగి రోడ్డుపైకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్ పంకజ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఎం. దేవేందర్ రెడ్డి, పి. సురేశ్ కుమార్​తో పాటు 30 సర్కిళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. 

సీజనల్ ​వ్యాధులపై వర్క్​షాప్​

గ్రేటర్ లో సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై హెడ్డాఫీసులో మెడికల్ అండ్ హెల్త్, అనుబంధ శాఖల అధికారులతో కమిషనర్​కర్ణన్​ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, సుభద్ర, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్​డాక్టర్ పద్మజ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు డాక్టర్ వెంకన్న, డాక్టర్ ఉమా, ఓయూ నుంచి ప్రొఫెసర్ జె వెంకటేశ్వరరావు, ఐఐసీటీ సైంటిస్ట్ కె.లక్ష్మీ నారాయణ రాజు పాల్గొన్నారు.