తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త జడ్జీలు
  • నోటిఫికేషన్ విడుదల చేసిన న్యాయ మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత సెప్టెంబర్ 16 నాటి కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జడ్జీలుగా  జస్టిస్ పి. శ్రీ సుధ,జస్టిస్ సి.సుమలత,జస్టిస్ జి. రాధారాణి, జస్టిస్ మాధవి దేవి,జస్టిస్ తుకారామ్,జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్త న్యాయమూర్తులతో కలిపి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 18కి చేరనుంది. కొత్త న్యాయమూర్తుల వివరాలు ఇలా ఉన్నాయి. 

జస్టిస్ మాధవిదేవి: హైదరాబాద్ నగరంలో 1965 డిసెంబర్ 28న జన్మించారు. కర్నాటకలోని గుల్బర్గాలో ఎల్ఎల్బీ, ఉస్మానియాలో ఎల్ఎంఎల్ పూర్తి చేసి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2005లో ఇన్ కమ్ ట్యాక్స్ అప్పీలెట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యులుగా.. ముంబయి, బెంగళూరులో పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ లోనే విధులు నిర్వహిస్తున్నారు. 
జస్టిస్ తుకారాంజీ: హైదరాబాద్ నగరంలో 1973 ఫిబ్రవరి 24న జన్మించారు. 1996లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కోర్టులతోపాటు పలు ట్రిబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ 2007లో జిల్లా జడ్జిగా ఎంపికై విశాఖపట్టణం, ఏలూరు, రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో పనిచేశారు. ప్రస్తుతం నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా ఉన్నారు. 
జస్టిస్ ఎం.లక్ష్మణ్: వికారాబాద్ జిల్లా వేల్చల్ గ్రామంలో 1965 జనవరి 24న జన్మించారు. 1991లో న్యాయవాద వృత్తిలో ప్రవేవించారు. రంగారెడ్డి, హైదరాబాద్ కోర్టులతోపాటు ఉమ్మడి హైకోర్టులోనూ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జిల్లా జడ్జిగా ఎంపికైన అనంతరం మహబూబ్ నగర్, నిజామాబాద్, నాంపల్లి ఆర్ధిక నేరాల కోర్టు, వరంగల్, ఖమ్మం జిల్లా కోర్టుల్లో పనిచేసి ప్రస్తుతం కార్మిక కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
జస్టిస్ ఎ.వెంకటేశ్వరరెడ్డి: మహబూబ్ నగర్ జిల్లాలో 1961 ఏప్రిల్ 15న జన్మించారు. 1987లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై 2005లో సీనియర్ సివిల్ జడ్జిగా అటు తర్వాత 2012లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. రంగారెడ్డి జిల్లా, ఆదిలాబాద్ జిల్లా జడ్జిగా, సీఐడీ సలహాదారుగా, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. తెలంగాణ హైకోర్టు ఏర్పడ్డాక మొదటి రిజిస్ట్రార్ జనరల్ గా విధులు చేపట్టి అక్కడే కొనసాగుతున్నారు. 
జస్టిస్ పి.శ్రీసుధ: నెల్లూరులో 1962 జూన్ 6న జన్మించారు. 1992లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి 2002లో జిల్జా జడ్జిగా ఎంపికయ్యారు. నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, కరీంనగర్, విశాఖపట్టణం, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వ్యవహరించారు. జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా, వ్యాట్ అప్పీలెట్ ట్రిబ్యునల్ గా విధులు నిర్వహించారు. 
జస్టిస్ గురిజాల రాధారాణి: గుంటూరు జిల్లా తెనాలిలో 1963 జూన్ 29న జన్మించారు. 1989లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించి ఏపీపీగా పనిచేశారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. 
జస్టిస్ చిలుకూరు సుమలత: ఏపీలోని నెల్లూరులో 1972 ఫిబ్రవరి 5న జన్మించారు. 1995లో న్యాయశాస్త్రం కోర్సు పూర్తి చేశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి ‘రైట్ టు టైమ్‌లీ జస్టిస్’ అనే అంశంపై పీహెచ్‌డీ చేశారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికై కర్నూలు, మదనపల్లె, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ గా పని చేశారు. ప్రస్తుతం సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు.