కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా

 కామారెడ్డి ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా
  • కోర్టును ఆశ్రయించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ కొడుకు 

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ కొడుకు ఇలియాస్​ పరువు నష్టం దావా వేశారు. తనపై ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ ఇలియాస్​ హైదరాబాద్​లోని ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు అడ్వకేట్  గరకరాజుల సుమంత్​ శనివారం కామారెడ్డిలో వెల్లడించారు.

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 17, 21 తేదీల్లో  ప్రెస్​మీట్ల ద్వారా షబ్బీర్​ అలీ కొడుకు ఇలియాస్​పై అసత్య ఆరోపణలు చేశారన్నారు. ఇలియాస్​ మీద రేప్  కేసులు ఉన్నాయని పరువు నష్టం కలిగించేలా ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. ఇలియాస్​ హైదారాబాద్​ నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ నెల 20న ఎమ్మెల్యే కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు.