
- డిగ్రీ అర్హత ఉంటే కారుణ్య నియామకాల కింద అపాయింట్
- ఆదేశాలు జారీ చేసిన సీఎండీ బలరామ్
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు.. కారుణ్య నియామకాల కింద డిగ్రీ అర్హత ఉంటే గ్రేడ్-3 క్లర్క్ పోస్టులు కల్పించనున్నట్లు తెలిపింది. 51వ నిర్మాణాత్మక సమావేశంలో గుర్తింపు పొందిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్‌తో జరిగిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ ఆదేశాలు జారీ చేశారు.
త్వరలో యాజమాన్యం, కార్మిక సంఘంతో ద్వైపాక్షిక ఒప్పందం, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అనంతరం ఉత్తర్వులు విడుదల కానున్నాయి. గతంలో డిగ్రీ అర్హత ఉన్న వారసులకు జనరల్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే లభించేవి. 2009 సర్క్యులర్ ప్రకారం.. మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీలు, డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తిచేసిన వారికే ఉద్యోగాలిచ్చేవారు. తాజా నిర్ణయంతో డిగ్రీ అర్హత ఉన్న వారసులకు కూడా గ్రేడ్-3 క్లర్క్ పోస్టులు ఇవ్వనున్నారు. ఈ ఏడాది జూన్ 27న డైరెక్టర్ (పర్సనల్) స్థాయి సమావేశంలో కార్మిక సంఘం ప్రతిపాదనపై యాజమాన్యం స్పందించి, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా ఎన్. బలరామ్ సానుకూల నిర్ణయం తీసుకున్నారు.