- ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లతో సీఎంసీ కమిషనర్ సృజన సమీక్ష
హైదరాబాద్ సిటీ, వెలుగు: హెచ్సిటీ పనుల భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశించారు. హెచ్సిటీ పనులపై టౌన్ ప్లానింగ్ అధికారులు, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లతో ఆమె బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఖాజాగూడ జంక్షన్ వద్ద డీఎల్ఎఫ్ నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు ఫ్లైఓవర్ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా షెడ్యూల్ సిద్ధం చేయాలని సూచించారు.
జోనల్, డిప్యూటీ కమిషనర్లు టౌన్ ప్లానింగ్ విభాగంతో సమన్వయం చేసుకుని భూసేకరణ చేయాలని, భూ యజమానులతో చర్చించి టీడీఆర్‌లకు అంగీకరించేలా ప్రయత్నించాలని చెప్పారు. గత ఆరు నెలల ముందు ఇచ్చిన పరిపాలనా అనుమతులపై సమీక్ష నిర్వహించి, ఆ పనులు అవసరమా లేదా అనే అంశంపై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శ్మశానవాటికల అభివృద్ధి, పార్కులు, వీధి దీపాలు, ఫుట్‌పాత్‌ల శుభ్రత పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, ఆక్రమణల తొలగింపు సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చి పోలీస్ రక్షణ పొందాలని సూచించారు.
గాంధీనగర్‌లో పర్యటనచింతల్ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో బుధవారం కమిషనర్ సృజన పర్యటించి ఇంటింటి చెత్త సేకరణపై ఆరా తీశారు. డ్రైవర్లు ప్రతిరోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణ చేయకపోతే ఆ వాహనాలను సీజ్ చేసి వేరొకరికి బాధ్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎస్ఎఫ్ఏపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి షాపు వద్ద రెండు డస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉండాలని, వ్యాపార సంస్థలు నిర్లక్ష్యం చూపిస్తే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
