సర్పంచ్ ఏకగ్రీవమైతే.. ఆ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక

సర్పంచ్ ఏకగ్రీవమైతే.. ఆ రోజే ఉపసర్పంచ్ ఎన్నిక
  •     పోలింగ్ దాకా ఆగొద్దు 
  •     ఆఫీసర్లకు ఎస్​ఈసీ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లంతా ఏకగ్రీవమైతే ఉప సర్పంచ్ ఎంపిక కోసం పోలింగ్ తేదీ దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఏరోజు ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారో.. ఆరోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు కీలక సర్క్యులర్ జారీ చేసింది. సాధారణంగా పంచాయతీ ఎన్నికల్లో రెండు దశల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు. 

నామినేషన్ల ప్రక్రియను స్టేజ్1 ఆఫీసర్ చూస్తే.. పోలింగ్, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నికను స్టేజ్2 ఆఫీసర్ చూస్తారు. ఒక పంచాయతీలో అన్ని స్థానాలు ఏకగ్రీవమైనప్పుడు.. పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే, ఫలితాలను డిక్లేర్ చేస్తారు. 

ఇలా డిక్లేర్ చేసిన రోజే.. వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేయాలని ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌ సంఘం ఆదేశించింది. అయితే ఏదైనా ఒక్క వార్డులోనైనా పోటీ ఉండి, పోలింగ్ జరగాల్సి వస్తే మాత్రం.. పాత పద్ధతిలోనే పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యాక చివరలో ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుందని ఎస్‌‌‌‌ఈసీ స్పష్టం చేసింది.