- బిల్లులు ఎక్కువ కాలం పెండింగ్‌లో పెట్టడం కరెక్ట్ కాదు: సుప్రీంకోర్టు
- కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను నిలిపివేయలేరు
- ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, తిరస్కరించి అసెంబ్లీకి పంపడం..
- ఈ మూడే గవర్నర్‌కు ఉన్న ఆప్షన్స్.. నిరవధిక ఆలస్యం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది
- రాష్ట్రపతి ప్రశ్నలకు అత్యున్నత న్యాయస్థానం సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రాల శాసనసభలు పంపించిన బిల్లుల ఆమోదానికి రాష్ట్రపతి, గవర్నర్లకు నిర్దిష్ట గడువు విధించలేమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అయితే, దీర్ఘకాలిక జాప్యం జరిగిన సందర్భాల్లో బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు కోర్టులు పరిమిత ఆదేశాలు జారీ చేయవచ్చని అభిప్రాయపడింది. అలాగే, కారణం చెప్పకుండా బిల్లులను గవర్నర్ సభకు తిరిగి పంపకుండానే నిలిపివేయవచ్చనే కేంద్ర ప్రభుత్వ వాదనలను తిరస్కరించింది. ఈ విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నల (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్)పై సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం సమాధానం ఇచ్చింది.
రాష్ట్ర శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును విధించడం తగదని పేర్కొన్నది. అలాంటి ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. గవర్నర్ ముందు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు కోర్టులు ‘డీమ్డ్ అసెంట్’ (ఆమోదం పొందినట్లే) ప్రకటించలేవని పేర్కొన్నది. తమిళనాడులోని 10 బిల్లులకు డీమ్డ్ అసెంట్ మంజూరు చేసేందుకు ద్విసభ్య ధర్మాసనం ఆర్టికల్ 142ను ఉపయోగించడం.. దాని అధికారానికి మించిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
రాష్ట్రపతి/గవర్నర్లకు ఉన్న రాజ్యాంగ అధికారాలను తాము చేపట్టలేమని లేదా అధిగమించలేమని పేర్కొన్నది. అదే సమయంలో.. గవర్నర్లు బిల్లులకు అనుమతివ్వకుండా నిరవధికంగా నిలిపివేయలేరని స్పష్టం చేసింది. బిల్లులను గవర్నర్లు సుదీర్ఘకాలం ఆమోదించకుంటే రాజ్యాంగ కోర్టులకు న్యాయ సమీక్ష అధికారం ఉందని తేల్చి చెప్పింది. అయితే, కారణం చెప్పకుండా గవర్నర్లు బిల్లులను వెనక్కి పంపలేరని పేర్కొన్నది. ఈ వ్యవహారంలో గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును సీజేఐ నేతృత్వంలోని బెంచ్ పక్కనపెట్టింది.
సుప్రీం పేర్కొన్న కీలక అంశాలు..
మేం గవర్నర్‌కు పరిమితమైన సూచనలు మాత్రమే ఇవ్వగలం. గవర్నర్‌కు రాజ్యాంగపరంగా 3 ఆప్షన్స్ ఉంటాయి. 1.బిల్లును ఆమోదించడం. 2.స్పష్టమైన కారణం చెప్పి బిల్లును రిజర్వ్‌లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం. 3.నిలుపుదల చేసి అసెంబ్లీకి తిరిగి పంపడం.. ఈ 3 మార్గాలను ఎంపిక చేయడంలో గవర్నర్ విచక్షణాధికారిన్ని ఉపయోగిస్తారు. గవర్నర్ బిల్లును తిరిగి సభకు పంపకుండా నిలిపేయడం సమాఖ్య పూర్తిని ఉల్లంఘించడమే అవుతుంది. గవర్నర్ బిల్లును సభకు తిరిగి పంపకుండానే నిలిపివేయవచ్చనే కేంద్ర వాదనలను తిరస్కరిస్తున్నాం
ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణాధికారం అంటే.. బిల్లును తిరిగి వెనక్కి పంపడం.. లేకుంటే రాష్ట్రపతికి రిజర్వ్ చేయడం మాత్రమే .
ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టం అమల్లోకి రాదు. ఈ ఆర్టికల్ కింద గవర్నర్ , శాసనసభ పాత్రలను మరొక రాజ్యాంగ వ్యవస్థ భర్తీ చేయదు.
బిల్లుల ఆమోదంపై రాజ్యాంగంలో ఎలాంటి కాల పరిమితి లేదు. ఆర్టికల్ 200 కింద అధికారాలను వినియోగించడానికి టైమ్‌లైన్ నిర్దేశించడం సరికాదు. చట్టాన్ని రూపొందించే ప్రక్రియలో సమతుల్యత కోసమే ఆర్టికల్ 200, 201 ఏర్పాటు చేశారు
గవర్నర్ల విధుల నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకోవు. కానీ, కారణం లేకుండా బిల్లులను పెండింగ్‌లో ఉంచిన సందర్భాల్లో కోర్టులు పరిమిత విచక్షణతో వ్యవహరించొచ్చు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లుల అంశంలోనూ ఇదే వర్తిస్తుంది.
నిరవధిక ఆలస్యం కొనసాగుతున్న సందర్భాల్లో అది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.
గవర్నర్ బిల్లును రిజర్వ్ చేసిన ప్రతిసారి రాష్ట్రపతి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. బిల్లులో స్పష్టత లేకుంటే, సలహా అవసరమని భావించినప్పుడు సుప్రీంకోర్టును సంప్రదించాలి.
రాష్ట్రపతి, గవర్నర్ ఆదేశాలను ఆర్టికల్ 142 కింద కోర్టులు సబ్‌స్టిట్యూట్ చేయలేవు. ఆర్టికల్ 142 ‘డీమ్డ్ అస్సెంట్’ (ఆమోదం పొందినట్లే) అనే భావనను అనుమతించదు.
కేసు నేపథ్యం ఇదీ..
అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ జాప్యంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం.. రాష్ట్రపతి/గవర్నర్లకు గడువు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ‘గరిష్టంగా 3 నెలల్లోగా బిల్లులను ఆమోదించడమో, తిప్పి పంపించడ మో చేయాలి’ అని పేర్కొంది. ఆర్టికల్ 143(1) కింద తనకున్న అధికారాల్ని వినియోగిస్తూ ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు అభిప్రాయాలను కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెఫరెన్స్ పంపారు. ఆర్టికల్ 361 ప్రకారం.. రాష్ట్రపతి/గవర్నర్ తమ అధికారాల నిర్వహణ విషయంలో ఏ కోర్టుకు జవాబుదారీగా ఉండరని ఉదహరించారు.
అలాగే, ఆర్టికల్ 200 కింద తన ముందు ఉంచినప్పుడు.. మంత్రుల మండలి అందించే సహాయం, సలహాకు గవర్నర్ కట్టుబడి ఉంటారా? అని కోర్టును ప్రశ్నించారు. దీనిపై సీజేఐ బీఆర్ గవాయి నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. సుదీర్ఘంగా 10 రోజులపాటు అన్ని పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్నది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం తరఫు వాదనలను కూడా కోర్టు స్వీకరించింది. అనంతరం సెప్టెంబర్ 11న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం రాష్ట్రపతి/ గవర్నర్లకు గడువు విధించలేమని స్పష్టం చేసింది.
