తమిళనాడులో విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. రూ.20వేల కోట్ల అదానీ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్‌కు గుడ్ బై!

తమిళనాడులో విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. రూ.20వేల కోట్ల అదానీ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్‌కు గుడ్ బై!

తమిళనాడులో హీరో విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అదానీ గ్రూప్‌కు చెందిన రూ. 20,000 కోట్ల స్మార్ట్ మీటర్ ప్రాజెక్టును రద్దు చేసిందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వైరల్ వార్త వెనుక ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు చూద్దామా...

సమాచారం ప్రకారం.... కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో తమిళనాడులో సుమారు 82 లక్షల స్మార్ట్ కరెంట్ మీటర్లను అమర్చాలని గతంలో ప్లాన్ చేశారు. ఇందుకోసం అక్కడి ప్రభుత్వ విద్యుత్ సంస్థ (TANGEDCO) నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది. అందులో చెన్నై పరిసర ప్రాంతాలకు సంబంధించిన కీలకమైన మొదటి ప్యాకేజీ టెండర్లలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థ అందరికంటే తక్కువ ధర కోట్ చేసింది.

కానీ, అదానీ గ్రూప్ కోట్ చేసిన ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఆ ఖర్చులను భరించలేమని పేర్కొంటూ అప్పట్లోనే ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. దీనికి తోడు అప్పట్లో అదానీ గ్రూప్‌పై వచ్చిన కొన్ని అంతర్జాతీయ ఆరోపణలు కూడా డీఎంకే ప్రభుత్వం టెండర్లను వెనక్కి తీసుకోవడానికి కారణమయ్యాయి.

విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి?
ఇక ప్రస్తుత పరిణామాల ప్రకారం... తమిళనాడులో కొత్తగా ఏర్పడిన సి. జోసెఫ్ విజయ్ (టీవీకే పార్టీ) ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. విద్యుత్ శాఖలో అవకతవకలు జరగకుండా చూడటానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉచిత, రాయితీ కరెంట్‌పై భారీగా ఖర్చు చేస్తోన్న నేపథ్యంలో.. ఇంత ఖరీదైన స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ వల్ల ప్రజలపై, ఖజానాపై మరింత ఆర్థిక భారం పడుతుందని భావించింది. అందుకే ఈ స్మార్ట్ మీటర్ ప్రాజెక్టును పూర్తిగా విరమించుకోవాలని విజయ్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు అదానీ టెండర్లను రద్దు చేసిన ఘనత కేవలం విజయ్ ప్రభుత్వానిదే కాదు. అదానీ కంపెనీకి సంబంధించిన టెండర్లను గతంలోని డీఎంకే ప్రభుత్వమే ధరలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో రద్దు చేసింది. ప్రస్తుత విజయ్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయకూడదని పూర్తిగా విరమించుకుంది.