75% జీతం పెంచుతామన్నా.. వద్దు..! సహోద్యోగులు కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిర్ణయం.. కంపెనీకి రాజీనామా..

 75% జీతం పెంచుతామన్నా.. వద్దు..! సహోద్యోగులు కోసం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిర్ణయం.. కంపెనీకి  రాజీనామా..

ట్విట్టర్ మాజీ బాస్ జాక్ డోర్సేకి చెందిన 'బ్లాక్' కంపెనీలో ఒక వింతైన ఘటన జరిగింది. కంపెనీ  ఉద్యోగుల్లో దాదాపు 40% మందిని అంటే సుమారు 4వేల మందిని తీసేసిన తర్వాత, ఒక మహిళా టెక్కీకి వచ్చిన భారీ ఆఫర్‌ను తిరస్కరించి ఉద్యోగానికి రాజీనామా చేశారు.

అసలేం జరిగిందంటే.... బ్లాక్ కంపెనీ  'AI' (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకం  పెంచుతున్నామని చెబుతూ, వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఓ మహిళా టెక్కీ టీం నుండి 70% మంది తొలగించారు. తన కళ్ల ముందే తనతో కలిసి పనిచేసిన తోటి ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోవడం ఆమెను తీవ్రంగా కదిలించింది.

తొలగింపుల తర్వాత మిగిలిన ఉద్యోగులు కంపెనీ వదిలి వెళ్లకుండా ఉండటానికి మేనేజ్మెంట్ వారికి భారీ ఆఫర్ ఇచ్చింది. అందులో ఆ మహిళా టెక్కీకి 75% జీతం పెంచుతామని, బోనస్ కలిపితే దాదాపు 90% పెంపు ఉంటుందని కంపెనీ ఆశ చూపింది. అంటే ఒక రకంగా ఆమె జీతం రెట్టింపు అయ్యే అవకాశం వచ్చింది. కానీ ఆమె ఈ ఆఫర్‌ను చూసి సంతోషపడలేదు. నా తోటి ఉద్యోగులను తొలగించి, నాకు జీతం పెంచడం అమానుషం. నా సహోద్యోగులు రోడ్డున పడితే, ఆ డబ్బుతో నేను సంతోషంగా ఉండలేను అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

AI పేరుతో మోసం?
కంపెనీ యజమాని జాక్ డోర్సే మాట్లాడుతూ.. AI వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, అందుకే మనుషుల అవసరం తగ్గిందని చెప్పారు. అయితే దీనిపై ఆ మహిళా టెక్కీ ఘాటుగా స్పందించారు.  గత ఏడాదిగా AI వాడమని మమ్మల్ని బలవంతం చేశారు. మా ఉద్యోగాలనే మింగేసే టూల్స్ మేమే తయారు చేయాల్సి రావడం దారుణం. AI వల్ల కంపెనీ పనితీరు పెరిగిందనే మాటల్లో నిజం లేదు అని అన్నారు. 

ఆమె ఎంతలా బాధపడ్డారంటే.. తన సహోద్యోగులతో పాటు తనను కూడా ఉద్యోగంలోంచి తీసేయమని  కోరారు. కానీ కంపెనీ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె స్వచ్ఛందంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. నాకు ఆర్థిక ఇబ్బందులు లేవు, అందుకే ఈ నిర్ణయం తీసుకోగలిగాను. కానీ వీసా సమస్యలు, కుటుంబ బాధ్యతలు ఉన్న నా తోటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఈమె రాసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.