ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ముంచాలె

ఈ కేంద్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ముంచాలె
  • నేను సిపాయిని.. యోధుడ్ని.. దేశం కోసం బయల్దేరుత: సీఎం​
  • కేంద్ర బడ్జెట్‌‌‌‌.. గోల్‌‌‌‌మాల్‌‌‌‌ గోవిందం
  • షెడ్యూల్‌‌‌‌ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు ఉంటయ్​
  • దేశవ్యాప్తంగా ఎంఐఎం ఎదిగితే మంచిదే కదా..!
  • 317 జీవోను వద్దనెటోళ్ల లాగులు పగులగొట్టాలె
  • త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన

హైదరాబాద్‌, వెలుగు: దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు సీఎం కేసీఆర్  చెప్పారు. దేశంలో ‘‘నయా సోంచ్‌.. నయా దిశా.. నయా సంవిదాన్‌’’ అవసరముందన్నారు. 75 ఏండ్ల కింద రాసుకున్న రాజ్యాంగం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని, అందుకే వాళ్ల ఆకాంక్షల మేరకు కొత్త రాజ్యాంగం రావాలని తాను కోరుకుంటున్నానని, దీనిలో తప్పేముందని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరగాలన్నారు. 50 ఏండ్ల ప్రజాజీవితంలో ఇదే రాజ్యాంగం తనకు ఎన్నో పదవులు ఇచ్చిందని, కానీ రాజ్యాంగంలో మార్పులు కోరుకుంటున్నానని చెప్పారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో రెండున్నర గంటల పాటు మాట్లాడారు. ‘‘రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా అంటూ ఎవరు ఏం చేయాలో స్పష్టంగా ఉంది. కానీ కేంద్రం రాష్ట్రాల అధికారాలు లాగేసుకుంటున్నయ్​” అని ఆరోపించారు. ‘‘వన్‌ నేషన్‌.. వన్‌ రిజిస్ట్రేషన్‌ అంటే దాని అర్థం ఏంటో చెప్పాలె. ఇది రాష్ట్రాల అధికారాలు హరించడం కాదా.. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం అంటే ఎట్లా..? ఇవన్నీ ఇట్లున్నాయి కాబట్టే నేను రాజ్యాంగం మార్చాలని కోరుతున్న..’’ అని స్పష్టం చేశారు.

ఆరునెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తం

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆరు నెలల ముందే ప్రకటిస్తానని కేసీఆర్​ చెప్పారు. తన దగ్గర ఇంకో మంత్రం కూడా ఉందని, వచ్చే ఎన్నికల్లో 95 నుంచి 105 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామన్నారు. ‘‘కొందరు బేకూఫ్‌గాళ్లు అదే పనిగా ముందస్తు ఎన్నికలని చెప్తున్నరు. ముందే ఎన్నికలకు ఏమక్కర ఉన్నది..? 103 మంది ఎమ్మెల్యేలతో బలంగా ఉన్నం.. వాడెవడో కుక్కగాడు చెప్తే ముందస్తు పెడ్తమా..? ఇంతకుముందు మాకు అక్కర ఉండే’’ అని పేర్కొన్నారు. 

 

కుక్కమూతి పిందె బీజేపీ ప్రభుత్వం

మోడీ అసలు రంగు ఈ బడ్జెట్‌తో బట్టబయలైందని కేసీఆర్​ ఆరోపించారు. బడ్జెట్‌ స్పీచ్‌ చూసిన తర్వాత తీవ్ర దుఃఖం కలిగిందన్నారు. ‘‘ఇంత దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వాన్ని నేను చూడలే.. పాలసీ లేదు.. పాసు లేదు.. వీళ్ల తీరుతోనే దేశం వెనుకబడ్డది. దేశానికి పుట్టిన కుక్కమూతి పిందె ఈ బీజేపీ ప్రభుత్వం. జలశక్తి మిషన్‌ అట. అంతా బోగస్‌’’ అని కేసీఆర్​ మండిపడ్డారు. దేశంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటిని భర్తీ చేయకుండా రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ధర్నా చేస్తరట అని బీజేపీ నేతలపై కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భారత సమాజం పురోగమించాలంటే ఈ దరిద్రం గొట్టు పార్టీని కూకటి వెళ్లతో పీకి బంగాళాఖాతంలో పారెయ్యాలే.. తప్పకుండా పెకిలించి పారేస్తం.. ఇంత కురుస బుద్ధి ఉన్న ప్రధానిని ఇంతకుముందు చూడలె. సీజేఐ రమణకు హైదరాబాద్​లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ పెట్టండి.. మేం అన్ని విధాల ఎంకరేజ్‌ చేస్తమని చెప్పినం. నిర్వహణకు రూ.3 కోట్ల చొప్పున ఇస్తమని చెప్పినం. స్థలం కేటాయించి, బిల్డింగ్‌ కట్టబోతున్నం.. ఐదో తేదీన దానికి ఫౌండేషన్‌ స్టోన్‌ వేస్తున్నరు. ఇక్కడికి ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ వస్తే మోడీకి నిద్ర పడతలేదు.. అహ్మదాబాద్‌లో పెట్టాలని వాళ్ల మీద ఒత్తిడి చేసిన్రు. గిఫ్ట్‌ సిటీలో ఆర్బిట్రేషన్​కు శిఖండిని పెడుతమని ఇయ్యాల బడ్జెట్‌లో పెట్టిండ్రు” అని కేసీఆర్​ అన్నారు.  ‘‘నిర్మలా సీతారామన్‌ ఇవ్వాల ఆత్మద్రోహం చేసుకున్నవ్‌.. శాంతిపర్వం శ్లోకం చెప్పి ధర్మం గురించి చెప్పి ఇంత అధర్మమా’’ అని మండిపడ్డారు. బీజేపీ సోషల్‌ మీడియా దొంగ మొఖంగాళ్లు తనను ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారని కేసీఆర్​ మండిపడ్డారు. ‘‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుతరు వీళ్లు..’’ అని దుయ్యబట్టారు. చినజీయర్‌ స్వామికి మైహోం రామేశ్వర్‌ రావు వంద ఎకరాల స్థలం విరాళంగా ఇస్తే అక్కడ రామనుజుల విగ్రహం పెడుతున్నారని తెలిపారు. దాన్ని మోడీ పెట్టించినట్టుగా నార్త్‌ ఇండియాలో బీజేపీ సోషల్​ మీడియా ప్రచారం చేసుకుంటున్నదని ఆరోపించారు.   

ఇరిగేషన్​ స్పెషల్​ సీఎస్​పై నో కామెంట్​

ఇరిగేషన్‌ స్పెషల్‌ సీఎస్​పై సోషల్‌ మీడియాలో వచ్చిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని కేసీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణలో కరోనా భయం లేదని, ఇక్కడ మాస్క్‌ పెట్టుకొని ప్రశ్నలు అడగాల్సిన అసవరం లేదని ఓ జర్నలిస్టును ఉద్దేశించి అన్నారు.  ఎమ్మెల్యేలు, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నామన్నారు. సుప్రీంకోర్టులో కేసు తేలిన తర్వాత చట్టం తెస్తామన్నారు.

317 జీవో గురించి ఏం తెలుసు?

317 జీవో గురించి ప్రతిపక్షాలకు ఏం తెలుసని కేసీఆర్​ ప్రశ్నించారు. ‘‘సెక్రటేరియట్‌లో మనోళ్లు 9 శాతం కూడా లేరు అని ఉద్యమంలో చెప్పినం.. ఇయ్యాలా 95 పర్సెంట్‌ ఉద్యోగాలు స్థానికులకే వస్తయి.. స్టేట్‌ లెవల్‌ పోస్టు అంటే 30 శాతం బయటోళ్లు వస్తరు.. అందుకే మల్టీ జోనల్‌ పోస్టు అని పెట్టినం.. మీకు పరిపాలన తెలుసా..  ప్రజల బాధ తెలుసా.. సిగ్గుతప్పి తెలివి లేకుండా 317 జీవో, నీ ముండ జీవో .. నీకు తెలివి ఉందా.. కొందరు స్వార్థపరులైన ఉద్యోగులు మేం ఇన్నే ఉంటం అని అంటున్నరు.. 317 జీవో అని మాట్లాడేటోని లాగు పగులగొట్టాలె’’ అని ఆయన అన్నారు. ఇప్పటికే 1.35 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని తెలిపారు. ‘‘దేశంలో గ్రోత్‌లో నంబర్‌ వన్‌ ఉన్నం.. మార్చిలో బడ్జెట్‌ పెట్టేటప్పుడు ఇవన్నీ చెప్పమా..  కడుపునోరు కట్టుకొని, అవినీతి రహితంగా మంచి సంస్కరణలు తెచ్చి ఎకో సిస్టం డెలవప్‌ చేసినం.. అందుకే పెట్టుబడులు ఆకర్షిస్తున్నం.. దీనిమీద కుక్కలు ఒర్రినట్టు ఒర్రుతం అంటే మీరు మొరిగే కుక్కలు అని మేం అంటం.. ’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.  బీజేపీ బండారం బయట పెడుతామని హెచ్చరించారు. ‘‘మీకు ఏం తెలుసు.. మీ ముండమొఖానికి తెలంగాణ ఉద్యమంలా ఉన్నరా.. లంగ సోషల్‌ మీడియాల హౌలా పోషిగాళ్ల లెక్క మాట్లాడుతున్నరు..  అది క్షుద్రవిద్య.. దాన్ని బండారం బయట పెడుతం’’ అని ధ్వజమెత్తారు.

ప్రాణమైనా అడ్డుపెడ్త.. 

హైదరాబాద్‌లో త్వరలోనే రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల సదస్సు నిర్వహిస్తామని కేసీఆర్​ తెలిపారు. గుజరాత్‌ సీఎంగా ఉండే మోడీ దేశానికి ప్రధాని అయ్యారని, తాను ప్రధాని పదవి కోసం ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేయడం లేదన్నారు. ‘‘దేశం గుణాత్మకమైన మార్పు కోసం నా ప్రాణమైన అడ్డుపెడ్త.. అందరినీ కలుపుకొనేపోత. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌  థాక్రేతో మాట్లాడిన.. మూడు, నాలుగు రోజుల్లో ముంబై పోతున్న’’ అని చెప్పారు. సింగపూర్‌లో ఏ రీసోర్స్‌ లేకున్నా, అక్కడి ప్రభుత్వానికి ఉన్న తెలివితో అన్నీ వస్తున్నయని, ఇక్కడ మనకు అన్ని వనరులు ఉన్నా.. పాలకులకు తెలివి లేకపోవడంతో వెనుకబడి ఉన్నామన్నారు.  తాను చెప్పేది అబద్ధమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు. తాను దేశ సిపాయిని.. యోధుడిని అని చెప్పారు.  ‘‘తెలంగాణ రాకముందు ఎకరం రూ.2 లక్షలు ఉండే.. నేను దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పెంచిన.. ఎవ్వడో కుక్కగాడు.. నక్కగాడు మాట్లాడుతడా.. హల్దీ, మంజీరాలో మేలో నీళ్లు పారించింది ఎవరు? ఈ క్షుద్ర కుక్కగాళ్లా..!’’ అని దుయ్యబట్టారు. 

నదులు అనుసంధానం జోక్‌ ఆఫ్‌ ది మిలీనియం

కేంద్రం బడ్జెట్‌లో చెప్పేదంతా అబద్ధమేనని, నదుల అనుసంధానం మిలీనియం ఆఫ్‌ ది జోక్‌ అని కేసీఆర్​ విమర్శించారు. గోదావరి - కావేరి అనుసంధానం ఎట్లా చేస్తారని ప్రశ్నించారు. బచావత్‌ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో చేరిన ప్రతి చుక్క గోదారి నీళ్లు ఈ రెండు రాష్ట్రాలకే చెందుతా యన్నారు. ‘‘మా ప్రాజెక్టులకు క్లియనెన్స్‌ ఇయ్యరట.. కావేరికి కలుపుతరట ఈ మొగోడు. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా బడ్జెట్‌లో ఎట్లా చెప్తరు.. మాతో మాట్లాడినవా, సంప్రదించినవా.. తెలివైన దేశాల్లో వందలు, వేల కి.మీ దూరం నీళ్లు తీసుకు పోతున్నరు. మేం వందల కి.మీ.ల దూరం.. వందల మీటర్ల ఎత్తుకు నీళ్లు ఇస్తున్నం’’ అని దుయ్యబట్టారు. 

కేంద్ర బడ్జెట్‌ గోల్‌మాల్‌ గోవిందం

కేంద్ర బడ్జెట్‌ గోల్‌మాల్‌ గోవిందం అని కేసీఆర్​ విమర్శించారు. ‘‘ఎయిర్‌ ఇండియాను అమ్మిండ్రు.. ఇయ్యాల బడ్జెట్‌లో ఎల్‌ఐసీని అమ్మేస్తమని చెప్పిండ్రు.. ఎల్‌ఐసీని ఎందుకు అమ్ముతున్నరు.. మంచి లాభాల్లో ఉన్న సంస్థను ఎందుకు అమ్ముతున్నరు.. నా మెదడు చాలా చిన్నది.. ఇది నాకు అర్థమైతలేదు.. వీళ్ల చర్యలు చూసి నా గుండె ద్రవించిపోతుంది.. అమెరికాలోని బీమా కంపెనీలకు మీరు బ్రోకర్లుగా వ్యవహరిస్తరా..’’ అని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చేది గుండు సున్న అని విమర్శించారు. దేశాన్ని సాదే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటని.. ఏటా రూ.60 వేల కోట్లు కేంద్రానికి ఇస్తే రాష్ట్రానికి హక్కుగా వచ్చేది రూ.22 వేల కోట్లే వస్తున్నాయని తెలిపారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్‌ స్కీంలకు ఎనిమిదేళ్లలో రూ.42 వేల కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ‘‘క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను వేస్తామని బడ్జెట్‌లో ప్రకటించడం ఏంది? ఈ కరెన్సీని కేంద్రం ఒప్పుకున్నదా? బుర్రలేకుండా ఎట్లా చెప్పినవ్‌.. దానికి ప్రాతిపదిక ఏంది..? మీరు ఎవరిని కన్ఫ్యూజ్‌ చేస్తున్నరు..’’ అని మండిపడ్డారు. పీఎం గతి శక్తి కింద రాష్ట్రాలకు ఇస్తామన్నది లక్ష కోట్ల అప్పేనని అదేమన్న గ్రాంటా సంతోషపడటానికి అని ప్రశ్నించారు. తాను మోడీ స్థానంలో ఉండి ఉంటే వంద లక్షల కోట్లు ఇచ్చేవాడినని కేసీఆర్​ చెప్పారు.

బీజేపీపై కేసీఆర్ తిట్ల పురాణం

‘‘సాయి సంసారి.. లచ్చి దొంగ 
    దరిద్రులు.. దరిద్రం మొఖాలు
    మందికి పుట్టిన బిడ్డలు మా పిల్లలే అని ముద్దాడే బేశరం గాళ్లు
    దమాక్ లేనోళ్లు.. మెంటల్ గాళ్లు
    సిగ్గు తప్పినోళ్లు.. మీ బొంద 
    మీది నెత్త కత్తా.. ముండ మొఖం గాళ్లు
    బోడ ముండ ఉద్యమం 
    కుక్కలు ఒర్రినట్టు ఒర్రుతరు... 
    కుక్కగాళ్లు.. నక్క గాళ్లు
    హౌల కోషిగాళ్లు
    లంగ సోషల్ మీడియా గాళ్లు
    సొల్లు పురాణం గాళ్లు
    ఇర్షి పొయిల వెడ్తం” ఇవీ ప్రెస్‌మీట్‌లో బీజేపీపై సీఎం కేసీఆర్ వాడిన బూతులు.