- 26.07 లక్షల టన్నుల సన్నాలు.. 26.73 లక్షల టన్నుల దొడ్డు రకాలు
- 9.78 లక్షల మంది రైతుల నుంచి సేకరణ
- రైతులకు రూ.11,308 కోట్ల చెల్లింపులు
హైదరాబాద్, వెలుగు: వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ 52.80 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేసింది. సర్కార్ టార్గెట్ 80 లక్షల టన్నులు కాగా ఇప్పటికే 66 శాతం ధాన్యం కొనేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వడ్ల కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 8,433 సెంటర్లు ఏర్పాటు చేసి కొనుగోళ్లు చేస్తున్నారు. గురువారం నాటికి 9.78 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన 52.80 లక్షల టన్నుల వడ్లలో 26.07 లక్షల టన్నుల సన్నవడ్లు, 26.73 లక్షల టన్నులు దొడ్డు రకాలు ఉన్నాయి. వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం వెంటనే చెల్లింపులు చేస్తున్నది. ఇప్పటి వరకు రూ.11,308 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది.
70 రోజుల్లో 70 శాతానికి చేరువ
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కొనుగోళ్లపై సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్లు, జిల్లాల అధికార యంత్రాంగంతో పర్యవేక్షణ చేస్తున్నారు. ఈసారి కొనుగోళ్లు ప్రారంభించిన 70 రోజుల్లోనే 70శాతం ధాన్యం సేకరించడం గమనార్హం. సన్నాలకు రూ.500 బోనస్ కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. సన్నవడ్లకు ఇప్పటికే రూ.314 కోట్ల వరకు రైతులకు అందించినట్లు అధికారులు వెల్లడించారు.
గతేడాది కంటే 12.80 లక్షల టన్నులు అదనంఈ సారి 80 లక్షల టన్నుల వడ్లు కొనుగోళ్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌కు 40 లక్షల టన్నుల ధాన్యం సేకరిచగా ఈ సారి గతేడాది కంటే 12.80 లక్షల టన్నులు అదనంగా కొనుగోళ్లు చేయడం గమనార్హం.

