ఇక డిజిటల్ బడ్జెట్‌‌‌‌! నిధుల లెక్క పక్కా..ఆర్థిక నిర్వహణలో మార్పులపై ఫోకస్‌‌‌‌

ఇక డిజిటల్ బడ్జెట్‌‌‌‌! నిధుల లెక్క పక్కా..ఆర్థిక నిర్వహణలో మార్పులపై ఫోకస్‌‌‌‌
  • ఈ ఆర్థిక సంవత్సరం నుంచే కొత్త విధానం అమలు
  • శాఖలు, పథకాల వారీగా నిధుల కదలికపై ప్రత్యేక ‘డాష్ బోర్డ్’
  • ఒక్క క్లిక్‌‌‌‌తో కేటాయింపులు, నిధుల విడుదల, పెండింగ్ వివరాలు
  • గ్రీన్‌‌‌‌ చానల్‌‌‌‌ స్కీమ్స్‌‌‌‌కు ఆటంకం లేకుండా ఫండ్స్‌‌‌‌ రిలీజ్‌‌‌‌
  • ఆర్థిక శాఖ ప్రతిపాదనలు..  నిధుల గందరగోళానికి చెక్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో పారదర్శకతను పెంచడంతోపాటు నిధుల విడుదలలో తరచూ తలెత్తుతున్న గందరగోళానికి  చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.  ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం (2026–27) లో ‘డిజిటల్ బడ్జెట్’ విధానాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ  కసరత్తు చేస్తున్నది. బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి నిధులు ఖర్చు చేసే వరకు ప్రతి రూపాయి లెక్క పక్కాగా ఉండేలా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ‘డాష్ బోర్డ్’ను ఏర్పాటు చేయనున్నారు.

ఏ శాఖకు ఎంత కేటాయించారు? అందులో ఇప్పటివరకు ఎంత విడుదల చేశారు? బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)  పరిస్థితి ఏమిటి? ఇంకా ఎంత పెండింగ్ ఉంది? అనే సమస్త సమాచారం అన్ని శాఖల అధిపతులకు (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీ) రియల్ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిసేలా ఈ వ్యవస్థను రూపొందించే ప్లాన్​ చేస్తున్నారు. పరిపాలనలో వేగం పెంచడం, సంక్షేమ పథకాలకు నిధుల కొరత రాకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానం తీసుకువస్తున్నది. దీని అమలుపై త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. 

అన్ని శాఖల హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీలకు ప్రత్యేక యాక్సెస్..

కొత్తగా రాబోతున్న ఈ డిజిటల్ బడ్జెట్ విధానంలో ప్రతి  శాఖ హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోడీకి ప్రత్యేకంగా లాగిన్ యాక్సెస్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఒక శాఖకు నిధులు కావాలంటే ఆర్థిక శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం, ఫైళ్లు ఎక్కడ ఆగిపోయాయో తెలియక సతమతం కావడం పరిపాటిగా మారింది. అయితే ఈ డాష్ బోర్డ్ విధానంతో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు తమకు కేటాయించిన బడ్జెట్ వివరాలను కంప్యూటర్ స్క్రీన్ పైనే క్షణాల్లో చూసుకునే వెసులుబాటు కలుగుతుంది. తమ శాఖ పరిధిలోని ఏయే పథకాలకు ప్రభుత్వం ఎంత కేటాయించింది? అందులో మొదటి త్రైమాసికంలో ఎంత విడుదలయ్యింది? ఇంకా ఎంత మొత్తం రావాల్సి ఉంది? అనే విషయాలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. దీనివల్ల ఆయా శాఖలు తమ అభివృద్ధి పనులను, పథకాల అమలును ముందస్తు ప్రణాళికతో వేగవంతం చేసే అవకాశం ఏర్పడుతుంది.

 చిట్టా అంతా అక్కడే!

సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆయా శాఖలకు భారీగా కేటాయింపులు ప్రకటిస్తారు. కానీ, ఆ తర్వాత ఆర్థిక శాఖ తమ వద్ద ఉన్న నిధుల లభ్యత, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి విడతలవారీగా నిధులను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చారు? ఎంత రిలీజ్ చేశారు? బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) ఎన్నింటికి ఇచ్చారు? లాంటి వివరాలు తెలుసుకోవడం కష్టమవుతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకే డిజిటల్ డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు డేటాను అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ చేయనున్నారు. కేవలం కేటాయింపులే కాకుండా, వాస్తవంగా చేతికందిన నిధులు, ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన బాకీలు ఎంతనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతోపాటు అనవసర జాప్యాన్ని నివారించడానికి ఆస్కారం ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. 

కేంద్ర పథకాలు, రాష్ట్ర వాటాపై స్పష్టత

కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో నెలకొంటున్న అస్పష్టతను తొలగించడానికి ఈ డిజిటల్ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెప్తున్నారు. చాలా సందర్భాల్లో కేంద్రం నుంచి వచ్చే నిధులు, దానికి రాష్ట్రం జత చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ల విషయంలో లెక్కలు సరిగ్గా తేలడం లేదు. కేంద్రం నుంచి ఏ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంత వస్తున్నది? దానికి రాష్ట్ర వాటా కింద ఎంత రిలీజ్ చేయాల్సి ఉన్నది? అనే వివరాలను ఈ డాష్ బోర్డులో ప్రత్యేకంగా పొందుపరుస్తారు. అలాగే, నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా అవసరాలకు ఎంత ఖర్చు చేస్తున్నామనే వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల రెండు, మూడు శాఖల మధ్య సమన్వయం అవసరమైనప్పుడు ఫైళ్ల కదలిక కోసం ఎదురుచూడకుండా, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ఈజీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. 

గ్రీన్ చానల్ పథకాలకు ‘లైన్​ క్లియర్​’

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సంక్షేమ పథకాలకు నిధుల ఆటంకం లేకుండా చూడటంలో ఈ డిజిటల్ బడ్జెట్ కీలక పాత్ర పోషించనున్నది. ముఖ్యంగా ‘గ్రీన్ చానల్’ పరిధిలోకి వచ్చే స్కీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎప్పటికప్పుడు నిధులు విడుదలయ్యేలా చూడనున్నారు. ఉదాహరణకు రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, స్కాలర్​ షిప్స్​, ఆరోగ్య శ్రీలాంటి పథకాలకు ఇన్​టైంలో ఆటోమేటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిధుల లభ్యతను సూచించడం.. లేదంటే ప్రాధాన్యతా క్రమంలో వాటిని ముందు వరుసలో ఉంచడం వీలవుతుంది. నిధుల గందరగోళం కారణంగా లబ్ధిదారులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది.